వర్మ ‘శారీ’ సైకో.. ట్రైలర్ చూశారా?
ఇప్పుడు ఆయన సమర్పణలో వస్తున్న చిత్రం శారీ కూడా అలాంటిదే. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌కి చెందినదిగా రూపొందింది.
ఇటీవల సినిమాల్లో వైవిధ్యం కోసం ప్రయత్నించే దర్శకులు చాలా మంది ఉన్నప్పటికీ, రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎప్పటికీ ట్రెండ్‌కి ముందుగా ఉంటాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ఏదో ఒక కొత్త అంశాన్ని హైలెట్ చేస్తోంది. ఇప్పుడు ఆయన సమర్పణలో వస్తున్న చిత్రం శారీ కూడా అలాంటిదే. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌కి చెందినదిగా రూపొందింది.
సోషల్ మీడియాలో అమాయకంగా ప్రేమలో పడడం, అది ఎలాంటి భయానక పరిణామాలకు దారితీస్తుందో చూపించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. వర్మ ఈ సినిమాకు కథను అందించగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, శారీ ప్రధానంగా ఓ అమ్మాయి చీరలో కనిపించడాన్ని చూస్తున్న అబ్బాయి, ఆమెను వెంబడించడం, చివరకు ఆ క్రమంలో చోటు చేసుకునే భయంకర పరిణామాలను హైలెట్ చేస్తోంది.
ఇలాంటి కథని ఎంచుకోవడం రామ్ గోపాల్ వర్మ స్పెషాలిటీ. సోషల్ మీడియా కారణంగా యువత ఎలా ప్రభావితమవుతుందో చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ చూస్తే మొదట ఆరాధ్య దేవి పాత్ర మామూలుగానే కనిపించినా, ఆమె చుట్టూ అబ్బాయి తిరుగుతున్న తీరు కాస్త భయాన్ని రేకెత్తిస్తుంది. ట్రైలర్‌లో కథ ఎలా నడుస్తుందనే విషయాన్ని క్లియర్‌గా చూపించారు.
ఫొటోగ్రాఫర్‌గా ఉన్న యువకుడు ఓ అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ తర్వాత ఏమి జరుగుతుందనేది అసలు ట్విస్ట్. వర్మ తరచూ రియలిస్టిక్ కథలతో వస్తుంటాడు కానీ, ఈసారి కథానాయిక పాత్రను న్యాచురల్‌గా మలచి మరింత ఆసక్తిని పెంచాడు.
ఇకపోతే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఆరాధ్య దేవి, సత్య యడు నటించారు. మరికొందరు కీలక నటులుగా సహిల్ సంపియాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కూడా ఉన్నారు. టెక్నికల్‌గా చూస్తే, ఈ సినిమాకి ఆనంద్ సంగీతం అందించగా, శబరి సినిమాటోగ్రఫీ చేశారు. ఎడిటింగ్ బాధ్యతలను గిరి కృష్ణ కమల్, పెరంపల్లి రాజేష్ నిర్వర్తించారు. సినిమాను రామ్ గోపాల్ వర్మ సమర్పించగా, రవి శంకర్ వర్మ నిర్మించారు.
సినిమా నిర్మాణానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కథానాయికగా నటించిన ఆరాధ్య దేవిని రామ్ గోపాల్ వర్మ ఓ ఇన్‌స్టా రీల్ చూసి ఎంపిక చేశారని తెలుస్తోంది. కేరళకు చెందిన ఈ నటి, వర్మ సంస్థ అయిన RGV DEN ద్వారా సెలెక్ట్ అయ్యారు. ట్రైలర్‌లో ఆమె పోషించిన పాత్రని చూస్తే, సినిమాలో ఆమె ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ అయితే RGV గత సినిమాలను గుర్తు చేస్తోంది. కానీ ఇటీవల కాలంలో ఆయనకు సరైన విజయాలు లేవు. మరి ఆడియెన్స్ ను శారీ సినిమా ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.