సీక్రెట్ షూటింగ్... 95 శాతం పూర్తి!
గత సంవత్సరం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరచిన యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;
గత సంవత్సరం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరచిన యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల క్రితం నిఖిల్ హీరోగా 'స్వయంభూ' అనే సినిమా ప్రారంభం అయింది. భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో చాలా మంది నిఖిల్ స్వయంభూ సినిమా క్యాన్సల్ అయిందని, కొన్ని రోజుల షూటింగ్ కే ప్యాకప్ చెప్పేసి అటకెక్కించారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా నిఖిల్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను 'స్వయంభూ' సినిమా వర్క్‌తోనే బిజీగా ఉన్నాను అన్నాడు. అంతే కాకుండా గత ఏడాది కాలంగా ఆ సినిమా మేకింగ్ జరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ మొత్తం చాలా రహస్యంగా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. రహస్యంగా సినిమా షూటింగ్ ఎందుకు చేస్తున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇప్పటి వరకు సినిమా 95% షూటింగ్ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. ఒక సినిమా షూటింగ్‌ను రహస్యంగా 95 శాతం పూర్తి చేయడం మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడుతున్న విషయం తెల్సిందే.
స్వయంభూ సినిమాను రహస్యంగా పూర్తి చేయడంకు గల కారణం ఏంటి అనే విషయమై ఆయన స్పందించలేదు. ప్రస్తుతానికి సినిమా చివరి దశ షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నాడు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసంను ఆయన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. అంటే సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నా విడుదలకు కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
నిఖిల్ స్వయంభూ సినిమాతో పాటు మరో వైపు భారీ బడ్జెట్ మూవీ 'ది ఇండియా హౌస్' ను సైతం మొదలు పెట్టాడు. పెద్ద బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆ సినిమా కోసం గుర్రపు స్వారీతో పాటు పలు యుద్ద విద్యలను, మార్షల్ ఆర్ట్స్‌ను నిఖిల్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు అత్యంత కీలకంగా తన కెరీర్‌లో నిలుస్తాయి అంటూ నిఖిల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హీరోగా నిఖిల్‌కి ఈ రెండు సినిమాల విజయం అత్యంత కీలకం. అందుకే కాస్త జాగ్రత్తగా టైం తీసుకుని ఈ సినిమాలను చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఈ రెండు సినిమాలు వస్తాయేమో చూడాలి.