తమిళ హీరోపై పూరి ఫోకస్.. మాస్ కంటెంట్ గ్యారెంటీ!

ఇదే సమయంలో, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.;

Update: 2025-03-17 08:07 GMT

టాలీవుడ్‌లో దర్శకుడిగా సంచలనం సృష్టించిన పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా ఆ స్థాయిలో విజయం సాధించలేకపోతున్నారు. లైగర్ భారీ అంచనాల మధ్య వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో నిరాశ పరచడంతో ఆయన కెరీర్‌కు గట్టి దెబ్బ తగిలింది. అంతకు ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా, ఆ తర్వాతి సినిమాలు అతని మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ నేపథ్యంలో తెలుగు హీరోలు అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో, పూరి తన దృష్టిని పరభాషా స్టార్స్ వైపు మళ్లించినట్లు సమాచారం. గతంలో గోపీచంద్, అఖిల్, నాగార్జున వంటి తెలుగు హీరోలతో సినిమాలు చేయనున్నట్లు వార్తలు వచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు.

ఇదే సమయంలో, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సెట్టయితే మాత్రం ఇది కచ్చితంగా ఆసక్తికరమైన కాంబినేషన్‌గా నిలవనుంది. విజయ్ సేతుపతి కేవలం కథా బలం ఉన్న సినిమాలకు ఓకే చెప్పే నటుడు. మాస్ హీరోగా కాకుండా, విభిన్నమైన కథలు, సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం అతని ప్రత్యేకత.

అందుకే ఆయనకు తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే, పూరి జగన్నాథ్ మాస్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు. ఈ ఇద్దరి కలయిక ఎలాంటి ప్రయోగంగా మారనుందనేది ఇప్పుడు అందరి ప్రశ్న. విజయ్ పర్ఫార్మెన్స్, పూరి మాస్ స్టైల్ కలిసి రానున్న సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే, ఇది పూరి జగన్నాథ్‌కు గేమ్‌చేంజర్ అవుతుందా అన్నది చూడాలి.

గతంలో కూడా పాన్ ఇండియా కంటెంట్‌తో లైగర్ చేసేందుకు ప్రయత్నించగా, ఫలితం నిరాశ పరిచింది. కానీ, ఈసారి విజయ్ సేతుపతి లాంటి నటుడితో కలిసి చేయడం అతనికి సక్సెస్ గ్యారంటీ అయ్యే అవకాశముంది. సినిమా మాసివ్ యాక్షన్ డ్రామా అవుతుందా, లేక విజయ్ మార్క్‌కు తగ్గ కథనా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా, ఫిల్మ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశముంది.

Tags:    

Similar News