ఇంటర్‌స్టెల్లార్ రీ రిలీజ్ బాక్సాఫీస్.. జాక్ పాట్ కొట్టేశారుగా!
ముఖ్యంగా IMAX, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ సినిమా చూడటం ఓ మేజిక్ అనిపిస్తోంది.;
సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇంటర్‌స్టెల్లార్ భారతీయ థియేటర్లలో మరోసారి సందడి చేస్తోంది. క్రిస్టఫర్ నోలన్ మాస్టర్‌పీస్‌గా నిలిచిన ఈ సినిమా, 2014లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ ఏడాది ప్రత్యేకంగా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో రీ రిలీజ్ అయ్యింది. ఊహించని విధంగా ప్రేక్షకుల నుండి అమోఘమైన స్పందన రాబట్టుకుంటూ, రోజురోజుకూ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తక్కువ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు సినిమా జాక్ పాట్ అనేలా ప్రాఫిట్స్ అందిస్తోంది. సినిమా మళ్లీ థియేటర్లలోకి రావడం అనేకమందికి ఆనందంగా మారింది. ముఖ్యంగా IMAX, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ సినిమా చూడటం ఓ మేజిక్ అనిపిస్తోంది. మొదటి వారంలోనే మంచి వసూళ్లు సాధించిన ఇంటర్‌స్టెల్లార్, రెండో వారం కూడా అదే జోష్‌ను కొనసాగిస్తోంది.
ఈ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కావడంతో నోలన్ సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది. మార్చి 17న ఇంటర్‌స్టెల్లర్ భారతదేశవ్యాప్తంగా 1.13 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. మొత్తం 728 షోల్లో ప్రదర్శించగా, IMAX థియేటర్లలోనే 57 లక్షల వసూళ్లు వచ్చాయి. 4DX స్క్రీన్లలో మరో 13.5 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ రీ-రిలీజ్ ద్వారా ఇండియాలో మొత్తం 10 రోజుల్లో 24.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు అయింది. మొదటిరోజు ఓపెనింగ్స్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఆ తరువాత రోజు నుంచి వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇది కేవలం ఓ సినిమాకు మాత్రమే చెందిన కలెక్షన్స్ అనుకోవడం పొరపాటు. ఈ రీ-రిలీజ్ మాదిరిగానే భవిష్యత్తులో మరిన్ని క్లాసిక్ సినిమాలు తిరిగి థియేటర్లలోకి రావడానికి ఇది ఓ ట్రెండ్ సెట్టర్ లా నిలుస్తోంది.
ముఖ్యంగా IMAX, 4DX లాంటి ఫార్మాట్లలో సినిమా చూసే ప్రేక్షకులు ఎక్కువగా పెరిగారని, వీటికి ఉన్న ప్రత్యేకత, అనుభూతిని థియేటర్‌లో అనుభవించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా వసూళ్లు కొనసాగుతాయా? అంటే దాదాపుగా అవుననే అనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తే, ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా 30 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. కొత్త సినిమాలతో పోటీ ఉన్నా కూడా, నోలన్ మ్యాజిక్ కొనసాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండియన్ బాక్సాఫీస్‌లో ఇంటర్‌స్టెల్లార్ రీ రిలీజ్ చేసిన మేజిక్ ఇంకా చాలా రోజులు కొనసాగేలా కనిపిస్తోంది.