మూవీ రివ్యూ : రాబిన్ హుడ్
'భీష్మ' చిత్రంతో మెప్పించిన జోడీ నితిన్-వెంకీ కుడుముల. మళ్లీ వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం.. రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.;

'రాబిన్ హుడ్' మూవీ రివ్యూ
నటీనటులు: నితిన్-శ్రీలీల-దేవ్ దత్త నాగె-రాజేంద్ర ప్రసాద్-షైన్ టామ్ చాకో- వెన్నెల కిషోర్-సిజ్జు-శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాతలు: రవిశంకర్ యలమంచిలి-నవీన్ ఎర్నేని
రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల
'భీష్మ' చిత్రంతో మెప్పించిన జోడీ నితిన్-వెంకీ కుడుముల. మళ్లీ వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం.. రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రామ్ (నితిన్) ఒక అనాథ. తాను ఉంటున్న అనాథ శరాణలయానికి డబ్బుల సమస్య రావడంతో చిన్నతనంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెడతాడు. బడా బాబుల ఇళ్లలో డబ్బులు దోచుకుని తన లాంటి అనాథల కడుపు నింపుతుంటాడు. దీంతో తన పేరు రాబిన్ హుడ్ గా మారుతుంది. ఐతే విక్టర్ (షైన్ టామ్ చాకో) అనే పోలీస్ అధికారి తన మీద స్పెషల్ ఫోకస్ పెట్టడంతో రాబిన్ హుడ్ అప్రమత్తం అవుతాడు. కొన్నాళ్లు దొంగతనాలు మానేసి.. సెక్యూరిటీ ఏజెంట్ పనికి కుదురుతాడు. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద కంపెనీ యజమాని తనయురాలైన నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వచ్చి వెళ్తుంటే.. ఆమె రక్షణ బాధ్యతలను రాబిన్ హుడ్ చేపడతాడు. ఐతే ఆమెను పనిగట్టుకుని రుద్రకొండ అనే ఊరికి రప్పిస్తుంది ఒక డాన్ గ్యాంగ్. మరి ఆ గ్యాంగ్ లక్ష్యం ఏంటి.. వారి నుంచి రాబిన్ హుడ్ ఆమెను కాపాడాడా.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఛలో.. భీష్మ చిత్రాలతో రచయితగా-దర్శకుడిగా బలమైన ముద్రే వేశాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఆ రెండు చిత్రాలకు ప్రధాన ఆకర్షణ ఎంటర్టైన్మెంటే. తన గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టయిల్లోనే వన్ లైనర్స్.. పంచు డైలాగులతో సటిల్ గా కామెడీ పండిస్తూనే మరోవైపు స్టోరీల్లో చిన్న చిన్న ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించాడు వెంకీ. 'రాబిన్ హుడ్' ప్రోమోలు చూసినా కామెడీకి ఢోకా లేనట్లే కనిపించింది. ఇక ఈ సినిమా ప్రమోషనల్ వీడియోల్లో ఫన్ చూస్తే సినిమాలో ఇంకెంత వినోదం ఉంటుందో అనుకున్నారు ప్రేక్షకులు. ఐతే కామెడీ పరంగా 'రాబిన్ హుడ్' నిరాశ పరచని సినిమానే. మరీ పేలిపోయే కామెడీ అని చెప్పలేం కానీ.. ప్రేక్షకులు అక్కడక్కడా బాగానే నవ్వుకుంటారు. కానీ కేవలం కామెడీ మీదే ఆధారపడి సినిమాలు నడవవు కదా? కథలో విషయం ఉండాలి. కొత్త సీన్లు పడాలి. అక్కడే 'రాబిన్ హుడ్' నిరాశ పరుస్తుంది. కామెడీ మీదే ఫోకస్ పెట్టిన వెంకీ.. కథ పరంగా ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ టెంప్లేట్ ఫాలో అయిపోవడంతో ఆ విషయంలో నిరాశ తప్పదు. సినిమా ఏదో అలా టైంపాస్ అయితే అయిపోతుంది కానీ.. బలమైన ఇంపాక్ట్ వేయలేకపోయింది. కామెడీ కోసం ఒకసారి చూడ్డానికి మాత్రం ఢోకా లేని సినిమా ఇది.
'రాబిన్ హుడ్'లో హీరోయిన్ ఒక పది రోజులు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చి వెళ్లాలనుకుంటుంది. కానీ ఆమె సెక్యూరిటీ గురించి తండ్రికి భయం ఉంటుంది. అప్పుడతడి అసిస్టెంట్ ఆమె సెక్యూరిటీ చూసుకునే బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలనుకుంటాడు. దీని కోసం గూగుల్ ను ఆశ్రయిస్తాడు. అందులో 'నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్ ఇండియా' అని కొడితే.. అక్కడ కనిపించే కంపెనీకి వెంటనే లక్ష డాలర్లు పంపి వెంటనే డీల్ ఓకే చేసేస్తాడు. ఇంతకీ అతను డీల్ కంపెనీ పేరేంటో తెలుసా? 'నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ'. దానికో డొక్కు ఆఫీస్. అందులో నలుగురు ముసలి సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఐతే లాజిక్స్ ప్రకారం చూస్తే ఒక బిలియనీర్ కూతురి సెక్యూరిటీ బాధ్యతను ఇలా అప్పగించడం సిల్లీగా అనిపించొచ్చు. కానీ ఈ సీన్ తెరపై చూసినపుడు ఫన్నీగా అనిపిస్తుంది. నవ్వుకుంటాం. 'రాబిన్ హుడ్'లో ఇలా ఇల్లాజికల్ గా అనిపించే.. 'క్రింజ్' ఫీల్ కలిగించే కామెడీ సీన్లు-డైలాగులు చాలానే ఉన్నాయి. అయినా సరే అవి నవ్విస్తాయి. టైంపాస్ చేయిస్తాయి. సినిమాకు ఆకర్షణ కామెడీయే.
కామెడీ ప్రధానంగా సాగే సినిమాల్లో కథ గురించి ఎక్కువ ఆశించలేం. కానీ ఎంతో కొంత అయినా అది ఎంగేజ్ చేయాలి. ఈ విషయంలో 'రాబిన్ హుడ్' మరీ లైట్ అనిపిస్తుంది. ఒక ఊరిని చెరబట్టే విలన్.. ఫారిన్ నుంచి వచ్చి అతడి వలలో చిక్కునే హీరోయిన్.. ఆమెకు రక్షకుడిగా మారే హీరో.. ఇలా ఒక రొటీన్ టెంప్లేట్లో సాగిపోతాయి ఇందులో పాత్రలు. హీరో-విలన్ ఎత్తులు పైఎత్తులు అన్నీ కూడా సాధారణంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో కామెడీ ప్రధానంగా సాగే సీన్ల వరకు 'రాబిన్ హుడ్' బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ విలన్ పాత్ర పరిచయం దగ్గర్నుంచి ఒక మూస ధోరణిలో సాగుతుంది. విలన్ చేసే గంజాయి వ్యాపారం తాలూకు వ్యవహారం కూడా ఏమంత ఆసక్తి రేకెత్తించదు. హీరో హీరోయిన్లు విలన్ ఊరిలో అడుగు పెట్టే దగ్గర్నుంచి 'రాబిన్ హుడ్' గ్రాఫ్ తగ్గుతూ వెళ్తుంది. విలన్.. తన గ్యాంగును లుక్స్ పరంగా భయంకరంగా చూపించారు కానీ.. వాళ్ల క్యారెక్టర్లు సిల్లీగా అనిపిస్తాయి. ఎక్కడా సీరియస్ గా తీసుకోలేని విధంగా విలేజ్ ఎపిసోడ్స్ నడుస్తాయి. ఐతే మధ్య మధ్యలో రాజేంద్ర ప్రసాద్-వెన్నెల కిషోర్ లను రంగంలోకి దించి కామెడీ డోస్ ఇవ్వడం ద్వారా సినిమా మరీ బోర్ కొట్టకుండా చూసుకున్నాడు దర్శకుడు. 'అదిదా సర్ప్రైజు' పాట యువతనకు ఆకట్టుకుంటుంది. ఆఖర్లో డేవిడ్ వార్నర్ వచ్చి కొంత హుషారు తెచ్చాడు. కేవలం కామెడీ కోసమే అయితే 'రాబిన్ హుడ్'పై ఒక లుక్ వేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టమే.
నటీనటులు:
నితిన్ రాబిన్ హుడ్ పాత్రకు సరిపోయాడు. ఎప్పట్లాగే తన లుక్ బావుంది. వయసు పెరుగుతున్నా ఇంకా యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. నితిన్ ఎక్కువ హడావిడి పడకుండా కూల్ గా నటించాడు. శ్రీలీల తన గ్లామర్ తో ఆకట్టుకుంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ తరహాలో తెలివి తక్కువ అమ్మాయి పాత్రలో కనిపించిన శ్రీలీల కామెడీ బాగానే చేసింది. అంతకు మించి విశేషంగా చెప్పుకునేలా తన పాత్ర.. నటన లేవు. విలన్ పాత్రలో దేవ్ దత్తా సాగే చూడ్డానికి భయం గొల్పేలా కనిపించాడు. తన పెర్ఫార్మెన్స్ ఒకే. మలయాళ నటుడు లాల్ ముఖ్య పాత్రలో రాణించాడు. వెన్నెల కిషోర్.. రాజేంద్ర ప్రసాద్ బాగానే నవ్వించారు. డేవిడ్ వార్నర్ క్యామియో బావుంది. మిగతా ఆర్టిస్టులు మామూలే.
సాంకేతిక వర్గం:
'రాబిన్ హుడ్'కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. జీవీ ప్రకాష్ కుమార్ పాటల్లో ఇదిదా సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం హుషారుగా సాగింది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. సినిమాలో నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రిచ్ గా తెరకెక్కింది. దర్శకుడు వెంకీ కుడుముల గత చిత్రాలతో పోలిస్తే కథ మీద ఫోకస్ తగ్గించినట్లు అనిపిస్తుంది. కామెడీ మాత్రం బాగానే డీల్ చేశాడు. తన వన్ లైనర్స్ ఆకట్టుకుంటాయి. కథలో బలం ఉంటే 'ఛలో'.. 'భీష్మ' చిత్రాలకు దీటుగా 'రాబిన్ హుడ్' నిలిచేది. రచయితగా.. దర్శకుడిగా వెంకీకి ఓ మోస్తరు మార్కులు పడతాయి.
చివరగా: రాబిన్ హుడ్.. కొన్ని నవ్వుల కోసం
రేటింగ్- 2.5/5