ఒక సినిమా మొత్తాన్ని పాటలా రాయడం ఆయనకే సాధ్యం
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రైటర్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రైటర్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ముఖ్యంగా సినిమాలకు లిరిక్స్ అందించడం సినిమాకు ప్రాణం పోయడంతో సమానం. అలా తమ పాటలతో, సంగీతంతో ప్రేక్షకులను మెప్పించే సంగీత దర్శకులలో ఆర్పీ పట్నాయక్ ఒకరు. ఆయన కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు మంచి గాయకుడు కూడా. ఆయన సంగీతాన్ని సమకూర్చిన ఎన్నో పాటలకు గాత్రాన్ని కూడా అందించారు. ఈరోజుకి ఆర్పీ పట్నాయక్ క్లాసిక్ హిట్స్ మనకు ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటాయి.
ఎక్కువగా జానపద బాణీలకు స్వరాలను సమకూర్చే ఆర్పీ పట్నాయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని గురువుగా భావిస్తారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసే పాటలు మనసుకి ఎంతగా హత్తుకుంటాయో.. సందర్భాన్ని బట్టి సమాజంలో జరుగుతున్న ఎన్నో అవినీతి పనులను అంతే నిక్కచ్చిగా ఎండగడతాయి. అందుకేనేమో సిరివెన్నెల పాట తేట తెలుగు ఊట అని అంటూ ఉంటారు..
ఈనాడు నిర్వహిస్తున్న నా ఉత్సాహం కవనం అనే కార్యక్రమంలో భాగంగా ఆర్పీ సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ ఆయన పాటలకి సంస్కారం, విలువలు ఉంటాయని ఆర్పీ పేర్కొన్నారు. అంతేకాదు ఆర్పీ మొదటి సినిమా శాస్త్రి గారితో కలిసి పని చేశారట. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా నుంచి ఆర్పీ తప్పుకున్నారు.
ఆర్పీ మ్యూజిక్ మెలోడీస్ లో మనసంతా నువ్వే చిత్రంలోని పాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీకి ఆర్పీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రోత్సాహం మీదే చేశారట. ‘ ఈ మూవీ కోసం థీమ్ సాంగ్ ట్యూన్ వినిపించినప్పుడు అస్త్రి గారు నీ స్నేహం అంటూ అద్భుతంగా రాశారు. ఆయన రాసిన ఆ పాట మూవీకి సౌల్ అయింది. సాధారణంగా లిరిక్ రైటర్స్ పాటలు రాసేటప్పుడు సినిమాలోని సందర్భం ఏమిటో అడిగి దాన్నిబట్టి రాస్తారు. కానీ శాస్త్రి గారు మాత్రం ఒక్క చిన్న బిట్టు రాయాల్సి వచ్చినా సినిమా మొత్తాన్ని వింటారు. ఆయన రాసే పాటలో సినిమాలోని అన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి’ అని ఆర్పి పేర్కొన్నారు.
అంతేకాదు శాస్త్రి గారు ఒక పాటలో సినిమా మొత్తాన్ని ఎలా రాస్తారు అనేదానికి మనసంతా నువ్వే సినిమాలోని కిటకిట తలుపులు పాటను ఉదాహరణగా ఆర్పీ చెప్పారు. ఈ పాట మధ్యలో..’'కంటతడి నాడు .. నేడు, చెంప తడిమిందే చూడు .. చెమ్మలో ఏదో తేడా .. కనిపించలేదా?’అనే ఒక అద్భుతమైన లైన్ వస్తుంది. అంటే ఇక్కడ హీరోయిన్ హీరోతో విడిపోయినప్పుడు బాధతో ఏడ్చింది.. కానీ ఆ తర్వాత అతను కనిపించాక ఆనందంతో కన్నీళ్లు కార్చింది.. ఈ రెంటికి మధ్య తేడా ఎంతో ఉంది.. శాస్త్రి గారు అదే విషయాన్ని ఆ పాటలో వివరిస్తూ ఒక్క సన్నివేశంలో మొత్తం సినిమాలో హీరోయిన్ అనుభవించిన ఫీలింగ్స్ ను చూపించారు. అంత చక్కగా ఫిలాసఫీని చెప్పడం, సందర్భానికి సినిమాకి పొంతన కుదిరేలా పాటను సమకూర్చడం శాస్త్రి గారికే చెల్లుతుంది అంటారు ఆర్పీ.