సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ.. KGF లాంటి స్టోరీతో!
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్.. రోడ్డు ప్రమాదం తర్వాత విరూపాక్ష మూవీతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్.. రోడ్డు ప్రమాదం తర్వాత విరూపాక్ష మూవీతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీ చేశారు సాయి దుర్గ తేజ్. కానీ ఆ చిత్రం సినీ ప్రియులను అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ కోసం సత్య షార్ట్ ఫిల్మ్ లో కనిపించారు.
2024లో అయిదు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు సాయి దుర్గ తేజ్ సౌండ్ లేదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అయితే డైరెక్టర్ సంపత్ నందితో గాంజా శంకర్ మూవీ గత ఏడాది అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ రాలేదు. టైటిల్ విషయంలో ఆ మధ్య వివాదం తలెత్తినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాదు ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోహిత్ అనే కొత్త దర్శకుడికి మెగా మేనల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిరంజన్ రెడ్డి నిర్మించనున్నారు. సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి రూపొందించనున్నారని టాక్.
1947 కన్నా ముందు కథతో ఈ మూవీ తెరకెక్కనుందని లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏపీ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ సాగనుందని సమాచారం. బ్లాక్ బస్టర్ సినిమా కేజీఎఫ్ లాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. సంబరాల ఏటి గట్టు- S.Y.G అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వినికిడి. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలిసింది. తాజా అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.
అయితే నిజానికి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ గురువారం ఇద్దామని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారని సమాచారం. అన్ని వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి కొన్ని నెలల గ్యాప్ తర్వాత సాయి దుర్గ తేజ్ కొత్త మూవీకి రంగం సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.