మేజర్ ముకుంద్‌కు నివాళులు.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్!

ఈ క్రమంలో సాయి పల్లవి తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించింది.

Update: 2024-10-28 07:37 GMT

సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''అమరన్''. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అనూహ్య స్పందన లభించింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవి తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించింది.


భారత ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా 'అమరన్' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామితో కలిసి సాయి పల్లవి ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించింది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

''అమరన్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించే ముందు నేను నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించాలనుకున్నాను. మన కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికుల జ్ఞాపకార్థం, వేలాది ఇటుకల లాంటి పలకలను కలిగి ఉన్న పవిత్రమైన దేవాలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను'' అని సాయి పల్లవి తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌లో రాజ్‌పుత్ రెజిమెంట్‌లో ఆఫీసర్ గా సేవలు అందించారు మేజర్ ముకుంద్ వరదరాజన్. ఖాజీపత్రి ఆపరేషన్ లో ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో 2014 ఏప్రిల్ 25న వీర మరణం పొందారు. ఆయనతో పాటుగా సిపాయి విక్రమ్ సింగ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా, ఆపరేషన్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శినందుకు గాను భారత ప్రభుత్వం 2015లో ఆయనకు మరణానంతరం అశోక్ చక్ర అవార్డును ప్రదానం చేసింది. అలాంటి ధైర్యశాలి ముకుంద్ వరదరాజన్ అసాధారణ జీవిత ప్రయాణాన్ని ''అమరన్'' సినిమాలో చూపించబోతున్నారు.

శివ్ అరూర్ & రాహుల్ సింగ్ రచించిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్' అనే పుస్తకం ఆధారంగా 'అమరన్' సినిమా తెరకెక్కింది. ఇందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి కనిపించనుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అక్టోబర్ 31న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇక 'అమరన్' ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది చాలా మంచి సినిమా. ఇది రియల్ సోల్జర్ జర్నీ. రెండు రోజులు ముందు ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు 'మా లైఫ్ కూడా ఇలాగే ఉంద'ని వారు చెప్పారు. చాలా రియలిస్టిక్ గా సినిమా తీశారు. నా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా చూపించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ 'తండేల్' సినిమాతో వస్తాను. అప్పుడు మరింత మాట్లాడదాం'' అని అన్నారు.

Tags:    

Similar News