సలార్.. ఆ డేట్ మిస్సయితే..
అదే సమయంలో ఇప్పటికే ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం నుంచి ఇండస్ట్రీలో ఒకటే చర్చ. అదే ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' మూవీ రిలీజ్ డేట్ గురించే. ఈ చిత్రం వాయిదా దాదాపుగా కన్ఫామ్ అయిపోయినా.. మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా చెప్పడానికి చాలా సమయమే తీసుకున్నారు. ఎట్టకేలకు తాజాగా ఈ వాయిదా గురించి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను చెబుతామని చెప్పారు.
అయితే ఎప్పుడైతే పోస్ట్ పోన్ ప్రచారం మొదలైందో అప్పటి నుంచి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి అందరిలో నిరాశ, ఆసక్తి, టెన్షన్.. మొదలయ్యాయి. అభిమానులేమో సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా, ప్రభాస్ భారీ సక్సెస్‌ను అందుకుంటే కాలర్ ఎగరేసుకు తిరుగుదామా అని ఎదురుచూస్తుంటే.. మేకర్స్ మాత్రం.. ఎక్కడ కొత్త రిలీజ్ డేట్ బాంబా వచ్చి తమ మీద పడుతుందో అని ఆందోళ చెందుతున్నారు.
అదే సమయంలో ఇప్పటికే ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ లేదా డిసెంబర్ క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావొచ్చని కథనాలు వస్తున్నాయి. మూవీటీమ్ కూడా సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని మంచి ఔట్ఫుట్తో అంచనాలకు తగ్గటుగా ఈ ఏడాదే తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో ఇక వచ్చే ఏడాదికే విడుదల చేయాలని అనుకుంటుందట.
ఏదిఏమైనా దాదాపుగా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ పక్కా అన్న ఊపు మాత్రం ఎక్కువ ఉంది. అభిమానులు కూడా అప్పుడే రావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ రెండు నెలల్లో రావడం మిస్ అయిందా.. ఇక ఈ చిత్రం 2024 మార్చులోనే అన్న టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే జనవరిలో సంక్రాంతి సీజన్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. గుంటూరు కారం, ఈగల్, నా సామి రంగ, హనుమాన్ ఇలా చాలానే వస్తున్నాయి. ఒకవేళ సలార్ దిగిన ఈ సినిమాలే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫిబ్రవరి చెప్పుకోదగ్గ సీజన్ కాదు. అందుకే ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉందడు. కాబట్టి ఇక ఈ చిత్రాన్ని మార్చికే తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి.