ఆయ‌న ఎంట్రీ కాప్ సిరీస్ కే ఓ బ్రాండ్!

రోహిత్ శెట్టి `సింగం ఎగైన్` భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-23 07:30 GMT

రోహిత్ శెట్టి `సింగం ఎగైన్` భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌ణ‌వీర్ సింగ్, అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాప్, జాకీ ష్రాఫ్‌, అర్జున్ క‌పూర్, క‌రీనా క‌పూర్, దీపికా ప‌దుకోణే, శ్వేతా తివారీ ఇలా స్టార్లు అంతా సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ పాత్ర‌ల తాలుకా లుక్స్ అంచ‌నాలు పీక్స్ కి చేర్చాయి. `సింగం` అంటే బాలీవుడ్ లో ఓ బ్రాండ్ ప్రాంచైజీగా గుర్తింపు ఉంది. ఇంత వర‌కూ రిలీజ్ అయిన ఏసినిమా ఫెయిల్ అవ్వ‌లేదు.

అన్ని సినిమాలు భారీ స‌క్సెస్ తో కోట్ల వ‌సూళ్లు తెచ్చి పెట్టాయి. దీంతో `సింగం` ఎగైన్ మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి ఇంత‌మంది హీరోల్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చి రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంచ‌నాలు పెంచేసాయి. రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైంది. వ‌ర‌ల్డ్ వైడ్ న‌వంబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు అంద‌ర్నీ కుదిపేస్తోంది.

సినిమాలో స‌ల్మాన్ ఖాన కూడా భాగ‌మైన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో ఆయ‌న చుల్ బుల్ పాండే పాత్ర‌లో మెర‌వ‌నున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ లో చుల్ బుల్ అంటే వెంట‌నే స‌ల్మాన్ పేరు గుర్తొస్తుంది. ఆ పాత్ర‌తో ఆయ‌న ఇండియా అంత‌టా ఎంతో ఫేమ‌స్ అయ్యాడు. ఈనేప‌థ్యంలో అదే పేరుతో సింగం ఎగైన్ లో ఆయ‌న‌కు ఓ పాత్ర రాసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇంత‌వ‌ర‌కూ ఈ విష‌యాన్ని మేక‌ర్స్ హైడ్ చేసి ఉంచారు.

స‌రిగ్గా రిలీజ్ స‌మ‌యంలో స‌ల్మాన్ కూడా న‌టిస్తున్నాడు? అనే వార్త సంచ‌ల‌నంగా మారింది. దీంతో సినిమాకి భారీ ఎత్తున ఓపెనింగ్స్ వ‌చ్చేస్తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అంత‌మంది స్టార్లు ఒకే ప్రేమ్ లో భాగ‌మైతే అభిమానుల‌కు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే సింగం వేగాన్ని ఆప‌డం అసాధ్య‌మే.

Tags:    

Similar News