కింగ్ ఖాన్‌తో అల్లు అర్జున్ ఇంకేదైనా స్పెషల్‌గా
పఠాన్, జవాన్ చిత్రాలతో 1000 కోట్ల క్లబ్ ని అందుకున్నారు షారూఖ్ ఖాన్. ఆ రెండు సినిమాల రికార్డులను వేటాడింది అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2`.
పఠాన్, జవాన్ చిత్రాలతో 1000 కోట్ల క్లబ్ ని అందుకున్నారు షారూఖ్ ఖాన్. ఆ రెండు సినిమాల రికార్డులను వేటాడింది అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2`. పుష్ప 2 చిత్రం 48 రోజుల్లో 1750 కోట్లు పైగా గ్రాస్ (1230 కోట్ల నెట్) వసూళ్లను సాధించింది. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు సంచలన హీరోలను శీతల పానీయ బ్రాండ్ థమ్సప్ ప్రచారకర్తలుగా ఎంపిక చేసుకుంది. ఇటు ఉత్తరాది, అటు దక్షిణాది రెండు ప్రాంతాలను కవర్ చేస్తూ, షారూక్- అల్లు అర్జున్ లతో ప్రచారం చేయించుకునే ఎత్తుగడను అనుసరిస్తోంది.
అయితే నార్త్- సౌత్ సూపర్‌స్టార్లు కలిసి కోలాల ప్రకటనల్లో నటించడం ఇప్పుడే కొత్త కాదు. పలు కోలా కంపెనీలు ఉత్తరాదిన క్రేజీ స్టార్ హీరోతో, దక్షిణాది క్రేజీస్టార్‌ని కలిపి అత్యంత భారీగా ప్రకటనలను రూపొందించి ప్రచారం చేయడం ద్వారా దేశమంతటా విస్త్రత ప్రయోజనాలను పొందుతున్నాయి. గతంలో బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కలిసి థమ్సప్ ప్రకటనలో కనిపించారు. అంతకుముందు రామ్ చరణ్, చిరంజీవి కూడా థమ్సప్ కి ప్రచారం చేసారు.
అయితే ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ తో కలిసి బన్నీ అదే థమ్సప్ ప్రకటనలో నటించడం అభిమానుల్లో చర్చగా మారింది. `పుష్ప` ఫ్రాంఛైజీతో ఐకాన్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిందని ఇది నిరూపిస్తోంది. అతడికి పెరిగిన ఇమేజ్, జాతీయ స్థాయి క్రేజ్‌ని ఈ ఎంపిక ఆవిష్కరిస్తోంది. టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా తన అద్భుత నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు. అతడికి దక్కిన కీర్తి ఎనలేనిది. అలాగే పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న షారూఖ్ గ్రేట్ కంబ్యాక్ తో అదరగొట్టగా థమ్సప్ తిరిగి అతడితో ప్రచారానికి సిద్ధమైంది.
థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ సంతకం చేసారా లేదా? అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా తెలుగు స్టార్ల హవా కొనసాగుతోంది. బాలీవుడ్ స్టార్లను మించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఔరా అనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కార్పొరెట్ బ్రాండ్ల విషయంలో షారూఖ్ తో సమాన గౌరవాన్ని బన్ని అందుకోనున్నాడు. పుష్పరాజ్ గా అద్భుత నటనకు ఫిదా అయిపోయిన బాద్ షా షారూఖ్, ఆ పాత్రకు బన్ని తప్ప ఇంకెవరూ సరిపోరని ప్రశంసించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి మార్చిలో థమ్సప్ ప్రకటనను చిత్రీకరించే అవకాశం ఉంది. ఈలోగా బన్ని త్రివిక్రమ్ తో తదుపరి చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నాడు. అలాగే షారూఖ్ కింగ్ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.