భానుప్రియ చెల్లెలు శాంతిప్రియపై స్టార్ హీరో దారుణమైన కామెంట్!
శాంతిప్రియ శరీరఛాయ గురించి భానుప్రియ మొటిమల గురించి పత్రికల్లో చెత్త కామెంట్లతో జర్నలిస్టులు కథనాలు రాసారు.
సహజంగానే స్టార్ల రంగు (వర్ణం) గురించి ప్రజల్లో చర్చ సాగుతుంటుంది. ప్రపంచం ఎంత అడ్వాన్స్ డ్ అయినా.. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా .. నేటి రోజుల్లోనూ కామెంట్లు చేయడం షరామామూలుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో స్టార్ల రంగు పొంగుపై కామెంట్లు చేసేవారిపై నెటిజనుల్లో బోలెడంత చర్చ సాగుతోంది. కింగ్ ఖాన్ షారూఖ్ వారసురాలు సుహానా ఖాన్ గోధుమ రంగుపైనా దారుణమైన కామెంట్లు చేసారు. అయితే నేటి కాలంలోనే ఇలా ఉంటే అంతగా విద్య లేని 90లలో సన్నివేశం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
నాటిరోజుల్లో మేటి కథానాయికలు భానుప్రియ- శాంతిప్రియ సైతం ఇలాంటి వర్ణ వివక్షను ఎదుర్కొన్నవారే. శ్వేతజాతీయులు అంటూ పత్రికల్లో రాస్తారు. నల్లజాతీయులు అంటూ విమర్శిస్తుంటారు. అలాంటి విమర్శలు వ్యంగ్యమైన రాతల్ని ఆ రోజుల్లోనే ఎదుర్కొన్నారు ఈ అక్కా చెల్లెళ్లు. శాంతిప్రియ శరీరఛాయ గురించి భానుప్రియ మొటిమల గురించి పత్రికల్లో చెత్త కామెంట్లతో జర్నలిస్టులు కథనాలు రాసారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో శాంతిప్రియ స్వయంగా ఓపెనయ్యారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన చర్మం రంగు గురించి హీనంగా ఎలా మాట్లాడాడో నటి శాంతిప్రియ వెల్లడించారు. హోస్ట్ సిద్దార్థ్ కన్నన్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శాంతిప్రియ చాలా రహస్యాల్ని రివీల్ చేసారు. 'ఇక్కే పె ఇక్క' (1994) సినిమాలో నటించేప్పుడు అక్షయ్ చేసిన దారుణ వ్యాఖ్యల్ని శాంతిప్రియ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. అతడు రంగు గురించి కామెంట్ చేసాడు. అయితే అతడు దాని గురించి పెద్దగా ఆలోచించకుండా కామెంట్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం సరదాకోసమే అనుకున్నాడు తప్ప సెన్సిటివ్ టాపిక్ అని గ్రహించలేదు. ''చూడండి ఆమె మోకాళ్లు ఎంత నల్లగా ఉన్నాయో'' అని అందరి ముందు అన్నాడు. మొదట్లో అతను నా మోకాళ్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. నేను కింద పడ్డానా? అని కూడా అడిగాడు. నేను అలాంటిదేమీ లేదని చెప్పాను. అప్పుడు అతను చెప్పాడు. కానీ ''మీ మోకాళ్లు ఎందుకు నల్లగా ఉన్నాయి.. ఇది రక్తం గడ్డకట్టడం.. అవునా?'' అని అన్నాడు. ఆ తర్వాత నేను తీవ్రంగా కలత చెందాను.
సెట్‌లో అక్షయ్ కామెంట్ చేసిన రోజును శాంతిప్రియ తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. అతడు కామెంట్ చేసిన సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు తాను కలత చెందానని గ్రహించేలోపు నవ్వేశారని శాంతిప్రియ చెప్పింది. అక్షయ్ తన వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పలేదని శాంతిప్రియ తెలిపారు. కానీ అతడు తన విషయంలో సరదాగా మాట్లాడుతున్నానని చెప్పాడు. అక్షయ్ ఇచ్చిన రీజనింగ్‌కి ఆమె ఎలా స్పందించిందని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ''నేను ఆ టాపిక్ ని అప్పటికి వదిలిపెట్టాను. ఆ సమయంలో మేము పెద్దగా గొంతు ఎత్తలేదు. అది నిర్మాతలకు తెలియడం లేదా షూటింగ్ ఆగిపోయే అవకాశం ఉన్నందున ఇవేవీ పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్తపడ్డాము.దక్షిణాది నుండి వెళ్లాం. దీనిని సీన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను'' అని శాంతిప్రియ తెలిపారు.
ఆ సమయంలో తన వయసు 23 ఏళ్లు అని కూడా శాంతిప్రియ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ''నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను... ఆ సమయంలో నా తల్లి బలమైన ఆధారం. మనం ఇప్పటికే దక్షిణాదిలోను హిందీ పరిశ్రమలోను అలాంటి వాటిని ఎదుర్కొంటాము. నా సోదరి భానుప్రియ కూడా దీనిని చాలా ఎదుర్కొంది. నా సోదరి మొటిమల గురించి కూడా కొన్ని హిందీ పత్రికలు రాశాయి. ఒక సినిమా కోసం ఆమె వసూలు చేసిన మొత్తం మొటిమల సంఖ్య ఆధారంగా లెక్కించినట్లు వారు రాశారు. అలాంటి జర్నలిజం 90వ దశకంలో ఉండేది. కాబట్టి నేను నా సోదరి చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు కూడా.. నా కొడుకులు దానిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నా పెద్ద కొడుకు ...'' ఆమె చెప్పారు. శాంతిప్రియ కు 'ఇక్కే పె ఇక్క' హిందీలో చివరి చిత్రం. తన షూటింగ్ రెండో రోజున అక్షయ్ కుమార్‌తో ఈ ఘటనను ఎదుర్కొంది.