న‌టుడిపై లైంగిక వేధింపుల కేసు.. FIR న‌మోదు..

ప‌లువురు న‌టుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టాలీవుడ్ లో కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వేధింపుల కేసులో అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-12-01 05:18 GMT

#మీటూ ప‌ర్య‌వ‌సానం చాలా మంది మేల్ న‌టుల‌కు చిక్కుల‌ను కొని తెచ్చింది. జ‌మానా కాలంలోని ఘ‌ట‌న‌ల‌పైనా న‌టీమ‌ణులు ఆరోపించ‌గా, పోలీసులు కేసులు న‌మోదు చేసి విచారించారు. ఇటీవ‌ల మ‌ల‌యాళ చిత్రసీమ‌లో జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక అనంత‌రం మీటూ మ‌ళ్లీ పుంజుకుంది. ప‌లువురు న‌టుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టాలీవుడ్ లో కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వేధింపుల కేసులో అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఈ వ‌రుస‌లో మ‌రో ఆరోప‌ణ‌. బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై 32 ఏళ్ల మహిళ తనను వేధింపులకు గురి చేసాడ‌ని ఆరోపించింది. ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించాల‌నే నెపంతో తన ఆఫీస్ కి ఆహ్వానించాడని ఆ యువ‌తి పేర్కొంది. నటుడు శ‌ర‌ద్ త‌న‌ను అవాంఛనీయంగా తాకాడ‌ని, అసభ్యకరమైన సందేశాలు పంపాడ‌ని ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన ఖర్ పోలీసులు అత‌డిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్లు 74, 75 మరియు 79 కింద కేసు నమోదు చేశారు. ఆరోపణలకు సంబంధించి ప్రశ్నించడానికి పోలీసులు అత‌డిని పిలిపించారు.

అధికారుల క‌థ‌నం ప్రకారం.. 26 నవంబర్ 2024న వీడియో రీల్స్ గురించి చర్చించాల‌నే నెపంతో ఆ యువ‌తిని త‌న ఆఫీస్ కి ఆహ్వానించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ యువ‌తి ఇచ్చిన‌ స్టేట్‌మెంట్ లో లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌ ఆధారంగా అత‌డిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఆమె అత‌డిపై స్టేట్‌మెంట్ లో జ‌రిగిన విష‌యాల‌ను విశ‌ద‌ప‌రిచారు.

తాను ఆఫీస్ కి వచ్చేసరికి.. కపూర్ అనుచితంగా దుస్తులు ధరించి, తనపై లైంగిక‌ దాడికి ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. ఈ సంఘటన తర్వాత కూడా కపూర్ నుంచి ఆ యువ‌తికి అసభ్యకరమైన ఎస్.ఎం.ఎస్‌లు వ‌చ్చాయి. అందులో వాయిస్ నోట్ త‌న‌ను మరింతగా బాధపెట్టింది. అనంత‌రం బాధితురాలు అతనిపై చట్టపరమైన చర్యను కోరింది.

తనపై వచ్చిన ఆరోపణలపై నటుడు శ‌ర‌ద్ క‌పూర్ నుండి ఇప్పటివరకు ఎటువంటి వ్యాఖ్య లేదా అధికారిక ప్రకటన విడుద‌ల కాలేదు. శరద్ 1994లో `మేరా ప్యారా భారత్` చిత్రంతో బాలీవుడ్‌లో నటనా రంగ ప్రవేశం చేసాడు. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌తో క‌లిసి పనిచేశాడు. ఎక్కువగా సహాయక పాత్రలు.. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. షారూఖ్ ఖాన్- జోష్, సుస్మితాసేన్ -దస్తక్ , హృతిక్ రోషన్ - లక్ష్య.. వంటి చిత్రాలలో అతడు నటించాడు. సల్మాన్ ఖాన్ నటించిన పొలిటిక‌ల్ డ్రామా `జై హో`లోను న‌టించాడు.

.

Tags:    

Similar News