గుసగుసల్లో సిద్ధార్థ్ ప్రేమాయణాలు
హీరో సిద్ధార్థ్ సడెన్ గా తన ప్రియురాలు అదితీరావ్ హైదరీని పెళ్లాడేసాడని ఇటీవల ప్రచారమైంది.
హీరో సిద్ధార్థ్ సడెన్ గా తన ప్రియురాలు అదితీరావ్ హైదరీని పెళ్లాడేసాడని ఇటీవల ప్రచారమైంది. కానీ తాము నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నామని ఆ తర్వాత సిధ్ వివరణ ఇచ్చాడు. అదితీతో తొందర్లోనే భాజాలు మోగనున్నాయనే వార్తల నడుమ.. ఒకసారి సిద్ధార్థ్ గత ప్రేమాయణాలు, బ్రేకప్ స్టోరీస్ పై మీడియాలో మరోసారి కథనాలు వైరల్ అవుతున్నాయి.
సిధ్ నేటితరంలో యువతులు మెచ్చే చాక్లెట్ బాయ్. అతడు కేవలం తమిళం తెలుగులోనే కాదు హిందీలోను లవర్ బోయ్ పాత్రలతో పాపులరయ్యాడు. నేటితరంలో సిద్ధార్థ్ కచ్చితంగా పాన్-ఇండియా స్టార్.. చాలామంది కంటే ముందే అన్ని భాషల్లో సుపరిచితుడయ్యాడు. కానీ పరిస్థితులు అనుకూలించక కెరీర్ పరంగా రేసులో వెనకబడ్డాడు. గతంలో అతడు నటించిన సినిమాలు, ఎంపిక చేసుకున్న పాత్రలు, అతడి కథానాయికలతో ప్రేమ వ్యవహారాలు ప్రజల్లో బోలెడంత చర్చకు తెరతీసాయి. అదంతా అటుంచితే తన చిత్రాల్లో కథానాయికలతో అతడు నడిపించిన ప్రేమాయణాలు అన్నివేళలా హాట్ టాపిక్.
సిద్ధార్థ్ తన కథానాయికలందరితో ఇంచుమించు ప్రేమలో పడ్డాడని గాసిప్స్ షికార్ చేసాయి. ముఖ్యంగా తమిళ మీడియాలో పలువురు జర్నలిస్టులు సిద్ధార్థ్ పై బహిరంగంగానే కథనాలు రాసారు. సిద్ధార్థ్ తన భార్య మేఘన నుంచి విడిపోయాక బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ తో ప్రేమలో పడ్డాడని ప్రచారమైంది.
రంగ్ దే బసంతిలో ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత శృతి హాసన్‌తో ప్రేమలో పడ్డాడని పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ కలిసి తెలుగులో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ సినిమాలు చేశారు. కానీ ఏడాదిన్నర పాటు కొనసాగిన వారి బంధానికి ముగింపు పలికారని కథనాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత సమంతతో సిధ్ కలిసి నటించాడు. అదే క్రమంలో సిద్ధార్థ్ - సమంత జంట ప్రేమలో పడ్డారని, పెళ్లి వరకూ వెళ్లారని ప్రచారమైంది. అయితే కొద్దిరోజులకే ఈ బంధం బ్రేకప్ అయింది.
ఆ తర్వాత కన్నడ హీరోయిన్ దీపా సన్నిధితో సిద్ధార్థ్ ప్రేమాయణం గురించి విస్త్రతంగా గుసగుసలు వినిపించాయి. సిధ్ సరసన దీపా సన్నిధి ఎనక్కుల్ ఒరువన్ అనే సినిమా చేసింది. ఇప్పుడు లేటెస్టుగా అదితీరావ్ హైదరీతో ప్రేమాయణం పెళ్లి వగైరా వార్తల్లోని అంశంగా మారింది. ఈ జంట కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు.