సంధ్య థియేటర్ ఘటన.. సుకుమార్ ఎంత ఆలోచించారంటే..

సుకుమార్ సతీమణి తబిత ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించి, అతని కుటుంబాన్ని ధైర్యం చెప్పగా, తర్వాత సుకుమార్‌ స్వయంగా వెళ్లి శ్రీతేజ్‌ కుటుంబానికి అవసరమైన భరోసా ఇచ్చారు.

Update: 2025-01-17 09:58 GMT

సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ లో ఏ స్థాయిలో అలజడిని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇష్టమైన హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను చూడాలని సంధ్య థియేటర్ కు వచ్చిన ఒక ఫ్యామిలీలో అనుకోకుండా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. రేవతి అని మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ శ్రీతేజ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే.

 

గాయపడిన శ్రీతేజ్‌ ఇప్పటికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక అల్లు అర్జున్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ, సుకుమార్ కూడా బాబు కోసం అండగా నిలిచింది. ఇప్పటికే పుష్ప 2 టీమ్ తరఫున ఆర్థిక సహాయం అందింది. అంతే కాకుండా గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు అన్ని కూడా వారే చూసుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా శ్రీతేజ్ కుటుంబానికి బలంగా అండగా నిలిచిన దర్శకుడు సుకుమార్‌ తన భిన్నమైన గుణాన్ని మరోసారి చాటుకున్నారు.

 

శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తన భార్యతో కలిసి ఆసుపత్రికి తరచుగా వెళ్లారు. అయితే వారు కలుసుకున్న ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు. సుకుమార్ సతీమణి తబిత ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించి, అతని కుటుంబాన్ని ధైర్యం చెప్పగా, తర్వాత సుకుమార్‌ స్వయంగా వెళ్లి శ్రీతేజ్‌ కుటుంబానికి అవసరమైన భరోసా ఇచ్చారు. ఇక ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఘటన జరిగిన వెంటనే సుకుమార్‌ శ్రీతేజ్ కుటుంబానికి రూ.5 లక్షలు తక్షణ సాయంగా అందించారు. ఆ సహాయంతో ఆ కుటుంబం కొంత ఊరట పొందింది. ఇది మాత్రమే కాకుండా, మరో రూ.50 లక్షల సహాయాన్ని కూడా ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో శ్రీతేజ్‌ కుటుంబానికి అందుతున్న ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ప్రతిరోజూ శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే ఉన్న సుకుమార్‌ కుటుంబం, అతని ఆరోగ్యం కోలుకునే వరకు ఎల్లప్పుడూ సహాయంగా ఉంటామని హామీ ఇస్తోంది.

తన కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఇచ్చిన భరోసా శ్రీతేజ్‌ కుటుంబానికి ఓ కొత్త ప్రాణశక్తి అందించింది. ఘటన జరిగిన వెంటనే శ్రీతేజ్‌కు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని అతని కుటుంబానికి మద్దతు అందించిన సుకుమార్‌ సతీమణి తబిత కూడా ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని ఆదరించే ప్రయత్నంలో తీసుకున్న చర్యలు జనాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఘటన జరిగి నలభై రోజులు దాటినా కూడా సుకుమార్ ఈ విషయంలో గొప్ప మనుసుతో బాధ్యత వ్యవహరించారు.

అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సుకుమార్‌ ఇలా తమ సహృదయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీతేజ్‌ ఆరోగ్యం కోలుకుని త్వరగా ఇంటికి చేరాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇక సుకుమార్ తబితా శ్రీతేజ్ ఫ్యామిలిని కలిసిన ఫోటోలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News