ప‌రిశ్ర‌మ‌లో అంత‌ర్గ‌త స‌మాచార‌మే చెప్పాను: కొండా సురేఖ‌

ఇదిలా ఉంటే కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని అంగీక‌రించారు.

Update: 2024-10-03 15:23 GMT

నాగ చైతన్య - సమంత రూత్ ప్రభు విడాకుల విషయమై తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి తెర తీసిన సంగ‌తి తెలిసిందే. చైత‌న్య తండ్రి, అక్కినేని నాగార్జున ఈ వ్య‌వ‌హారంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లకు దిగారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 356 కింద నాగార్జున సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖ‌లు చేశారు.

ఇదిలా ఉంటే కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని అంగీక‌రించారు. త‌న‌కు కోపం వ‌చ్చినందునే వాస్త‌వాలు మాట్లాడాన‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ జంట విడాకుల‌కు కార‌ణ‌మేంటో ఎవ‌రికీ తెలీద‌ని, త‌న‌కు ఇండ‌స్ట్రీ నుంచి అందిన అంత‌ర్గ‌త స‌మాచారం మేర‌కు దీనిని మాట్లాడాన‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఈ రోజు నుంచి కేటీఆర్ హైద‌రాబాద్ లో కానీ, జిల్లాల్లో కానీ తిర‌గ‌లేర‌ని కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

వివాదం మూలాల్లోకి వెళితే.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయుకుడు కేటీఆర్ ని విమ‌ర్శించే క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కురాలు కొండా సురేఖ మ‌ధ్య‌లోకి స‌మంత‌- చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారాన్ని లాగాల‌ని చూశారు. కానీ అది బెడిసికొట్టింది. కొండా తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యారు. ఇప్పుడు చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంది. నాగార్జున కోర్టును ఆశ్ర‌యించారు. తన ఫిర్యాదులో కొడుకు నాగచైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కాపీని జోడించి.. మంత్రి వ్యాఖ్యలు తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని నాగార్జున ఆరోపించారు. రాజకీయ లబ్ధి, సంచలనం కోసం ఫిర్యాదుదారుడికి, అతని కుటుంబ ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను ప్రజలకు చేరవేయాలనే దురుద్దేశంతో ఈ ప్రకటన చేశారు...! అని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగ‌ణించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. నాగ చైతన్య - సమంతా రూత్ ప్రభు ఇద్దరూ కూడా మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. విడిపోవాలనే వారి నిర్ణయం పరస్పరం తీసుకున్న‌ది అని చెప్పారు.

నటీనటుల విడాకులకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేత కేటీ రామారావు కారణమని సురేఖ ఆరోపించారు. సురేఖ‌ వ్యాఖ్యలను తెలుగు సినీ పరిశ్రమ ప్ర‌ముఖులు తీవ్రంగా ఖండించారు. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు త‌దిత‌ర‌ సినీ ప్రముఖులు ఆమె చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వివాదం పెద్దదయ్యేలా కనిపించడంతో, సురేఖ తన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకోగా, ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ సినీ పరిశ్రమను కోరింది.

Tags:    

Similar News