అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలి.. న్యూ డిమాండ్
ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచడంపై చాలా విమర్శలు వచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేంద్రంగా ఇప్పుడు తెలంగాణాలో రాజకీయ వివాదం నడుస్తోంది. అది 'పుష్ప 2' మీద కూడా పడిందని చెప్పాలి. ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచడంపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు 'పుష్ప 2' సినిమాలోని కథ, హీరో క్యారెక్టరైజేషన్ మీద కూడా తెలంగాణలో విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (నవీన్) అల్లు అర్జున్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో కూడా జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణం అంటూ నవీన్ తన యుట్యూబ్ ఛానల్ లో ఆరోపించారు. తాజాగా సంధ్య థియేటర్స్ ఘటన నేపథ్యంలో జరుగుతోన్న వివాదం ఉద్దేశించి ఆయన మరోసారి సంచనల విమర్శలు చేశారు. 'పుష్ప 2' సినిమా ఎర్రచందనం దొంగలని ప్రోత్సహించి, సమాజానికి చెడు సందేశం ఇచ్చిందని నవీన్ అన్నారు. కొత్తగా మరింత మంది దొంగలని ఈ సినిమా తయారుచేసేలా ఉందని విమర్శించారు.
అలాగే సినిమాలో పోలీసుల మనోభావాల్ని కూడా దెబ్బతీశారని అన్నారు. ఇలాంటి సినిమాలో నటనకి గాను బన్నీకి ఇచ్చిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలని అన్నారు. అలాగే పోలీసుల మనోభావాల్ని దెబ్బతీసిన సుకుమార్ పైన కేసు పెట్టి అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కూడా బన్నీకి నేషనల్ అవార్డు ఇవ్వడంపై ఈయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 'జై భీమ్' సినిమాలో సూర్యకి ఇవ్వకుండా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడాన్ని తప్పు పట్టారు.
తాజాగా జరుగుతోన్న వివాదం నేపథ్యంలో తీన్మార్ మల్లన్న మరోసారి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కూడా 'పుష్ప 2' సినిమా కథ పైన విమర్శలు చేశారు. ఒక స్మగ్లర్ ని హీరోగా చూపించి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
మరో వైపు 'పుష్ప 2' సినిమాకి వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ 1500 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీలో 650 కోట్ల మార్క్ దాటేసి హైయెస్ట్ గ్రాస్ హిందీ మూవీగా నిలిచింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ఉన్న 'బాహుబలి 2' రికార్డ్ ని సైతం 'పుష్ప 2' బ్రేక్ చేసింది.