మిరాయ్: అనుకున్నట్లే మళ్ళీ వాయిదా.. ఇదే న్యూ డేట్!

ఇప్పుడు ఆ సక్సెస్ పై మరొక అడుగు ముందుకేసే ప్రయత్నంలో, సూపర్ హీరోగా మరో విభిన్నమైన అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2025-02-22 06:11 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ పై మరొక అడుగు ముందుకేసే ప్రయత్నంలో, సూపర్ హీరోగా మరో విభిన్నమైన అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే మిరాయ్. ఈ పాన్ ఇండియా మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


హనుమాన్ తో తేజ సజ్జా హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ఒకే చేస్తున్నాడు కానీ రిలీజ్ విషయంలో మాత్రం స్పీడ్ పెంచడం లేదు. మంచి అవుట్ పుట్ కోసమే అతని దర్శక నిర్మాతలు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా మిరాయ్ కూడా హనుమాన్ రేంజ్ హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే సినిమాను ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన మళ్ళీ జూన్ కి షిఫ్ట్ చేయాలని చేశారు.

ఇక ఇప్పుడు మరికొంత సమయం తీసుకొని న్యూ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. మేకర్స్ మిరాయ్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2డి, 3డి ఫార్మాట్స్ లో మూవీని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం పండుగల సీజన్ లో సినిమా విడుదల కావడంతో, వసూళ్లు కూడా విపరీతంగా పెరగనుండటం ఖాయం.

రిలీజ్ డేట్ పోస్టర్ లో తేజ సజ్జా మంచు కొండల మధ్య, చేతిలో తన ఆయుధాన్ని పట్టుకుని దేన్నో చూస్తున్నట్లు చూపించారు. ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమా గ్రాండియర్ స్పష్టంగా అర్థమవుతోంది. సినిమా కేవలం తేజ సజ్జా పాత్ర చుట్టూ తిరిగేలా కాకుండా, ప్రతినాయకుడి పాత్రను కూడా అంతే పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఆ పాత్రలో సీనియర్ హీరో మంచు మనోజ్ కనిపించనున్నారు.

సినిమాలో మంచు మనోజ్ తన విలన్ రోల్ తో ప్రేక్షకులను షాక్ కి గురిచేయనున్నాడని టాక్. హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తుండగా, జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, సినిమాటోగ్రాఫర్ గా కూడా ఈ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనతో పాటు మణిబాబు కరణం కలిసి రాశారు.

హనుమాన్ ఫేమ్ గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వీరందరి కలయికలో సినిమా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లా రూపొందుతోందనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో యుద్ధ సన్నివేశాలు, హై లెవెల్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, తేజ సజ్జా పాత్రలోని సూపర్ యోధా యాంగిల్, అతని లుక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మిరాయ్ కోసం తేజ సజ్జా ఫిజికల్ గా కూడా తగిన మార్పులు చేసుకుని, ఫుల్ డెడికేషన్ తో పని చేస్తున్నాడని మూవీ యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News