దీపావళి వీకెండ్.. వసూళ్లే వసూళ్లు..
దీపావళి కానుకగా ఎప్పటిలానే ఈ ఏడాది పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
దీపావళి కానుకగా ఎప్పటిలానే ఈ ఏడాది పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివ కార్తికేయన్- సాయిపల్లవి అమరన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు పలు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అవి ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర కూడా క్లిక్ అవ్వలేదు.
అయితే దీపావళికి ఈసారి లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో క, లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలు రెండు రోజులూ ఓ రేంజ్ లో దూసుకెళ్లాయి. నిన్న, మొన్న థియేటర్లన్నీ కళకళలాడుతూ కనిపించాయి. అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీపావళి వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టాయి. దీంతో మూడు సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ సెంటర్స్ లో లక్కీ భాస్కర్, మాస్ సెంటర్స్ లో క రాణిస్తున్నట్టు సమాచారం. అమరన్ అన్ని దగ్గర దూసుకెళ్తున్నట్లు టాక్.
తొలుత క సినిమా విషయానికొస్తే.. రెండు రోజుల్లో రూ.13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడు రోజులు కలిపి రూ.19.41 కోట్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పుడు నాలుగు రోజులు కలిపి రూ.24 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో క మూవీకి వీకెండ్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూడు రోజుల్లో రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు నిన్న మేకర్స్ ప్రకటించారు. ఆదివారం మరింత వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులు కలిపి రూ.50 కోట్ల మార్క్ కు చేరువలోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరిపోయినట్లు సమాచారం. మరోవైపు, అమరన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వేరే లెవెల్ కలెక్షన్స్ సాధిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన అమరన్.. కేవలం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా.. మిగిలిన రూ.50 కోట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. సండే ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దీపావళి వీకెండ్ లో మూడు సినిమాలకు కూడా వసూళ్లే వసూళ్లు అని చెప్పాలి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నారన్నమాట.