BRO మూవీలో హవాలా డబ్బు.. ఖండించిన నిర్మాత!
సినిమాలో పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు రికార్డులు మెయింటెయిన్ చేసారా? వైకాపా వాళ్లు ఈడీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చాక ఆయనపై ప్రత్యర్థుల ఆరోపణల ఫర్వం గురించి తెలిసిందే. సినిమాలతో రాజకీయాల్ని ముడివేసి చూడటం ఇటీవల మరింత ఎక్కువైంది.
ఇప్పుడు 'బ్రో' సినిమాపైనా వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోకి హవాలా డబ్బు పెట్టుబడులుగా పెట్టారని వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసారు. అమెరికాలో తెలుగు దేశం పార్టీ కలెక్ట్ చేసిన డబ్బును నిర్మాత విశ్వప్రసాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ద్వారా ఇండియాకు రీరూటింగ్ చేస్తున్నారని.. ఇక్కడ సినిమాలో పెట్టుబడి పెట్టారని అంబటి ఆరోపించారు.
సినిమాలో పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు రికార్డులు మెయింటెయిన్ చేసారా? వైకాపా వాళ్లు ఈడీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు.. మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా? అని టీవీ9 రజనీకాంత్ ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ ని ప్రశ్నించగా.. ఆయన క్లుప్తంగా జవాబు ఇచ్చారు.
ఇండియాలో బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన నియమాలు అన్నీ పాటిస్తాం. అమెరికా నుంచి తెచ్చే డబ్బుకు ఆర్బీఐ నుంచి స్పష్ఠంగా లెక్క తేలాకే తెస్తాం. స్థానికంగా తెచ్చే దానికి లెక్కలుంటాయి. జీఎస్టీ కడతామని తెలిపారు.
టీజీ వెంకటేష్ తెలుగు దేశం నాయకుడు.. ఆయన కుమారుడు భరత్ కూడా మీకు కొడుకు వరుస.. తెదేపా సన్నిహితుడైన పవన్ కల్యాణ్ తో సినిమా తీసారు. దీనివల్ల రాజకీయాలు సినిమాలు కలగలిసిపోయాయి.. ఇప్పటి ఆరోపణలకు ఇది కారణం కాదా? అని హోస్ట్ రజనీకాంత్ ప్రశ్నించగా.. ''స్పెక్యులేషన్స్ రకరకాలుగా ఉంటాయి. నాకు భాజపా సహా అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలున్నాయి. నాకు డబ్బును రీరూటింగ్ చేయాల్సిన పని లేదు'' అని విశ్వప్రసాద్ అన్నారు. నా బిజినెస్ లు నేను చేయగలను.. డబ్బును రూటింగ్ చేయాల్సిన పని లేదు. ఐదేళ్లుగా సినిమా వ్యాపారంలో ఉన్నాం. పాతిక సినిమాలు చేసాం అని కూడా అన్నారు.
హరిహర వీరమల్లు - బ్రో సినిమాలు చిత్రీకరణ మధ్యలో ఉండగానే మీ సినిమాని ఒప్పుకుని పూర్తి చేసారు పవన్ కల్యాణ్. వాటి కంటే ముందే మీ సినిమా వచ్చేసింది. ఇది ఎలా సాధ్యం? అని టీవీ9 రజనీకాంత్ ప్రశ్నించగా.. ఆ రెండు సినిమాల కంటే ముందే బ్రో సినిమా కథను పవన్ ఓకే చేశారని .. ఫిబ్రవరి 2023లో తమకు కాల్షీట్లు లభించాయని తర్వాత షెడ్యూల్ ప్రకారం చిత్రీకరించి రిలీజ్ చేసామని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు.