మ‌రో ముగ్గురు సినీ సెల‌బ్రిటీల‌ను చంపేస్తామ‌ని బెదిరింపులు

ముంబైలోని ట్రాఫిక్ పోలీస్ కార్యాల‌యాల‌కు బెదిరింపు ఈమెయిల్స్ అంద‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం సృష్టించింది.

Update: 2025-01-23 10:30 GMT

బాలీవుడ్ స్టార్ల‌కు బెదిరింపులు ఆగ‌డం లేదు. గ్యాంగ్ స్ట‌ర్స్ బెదిరింపులు ఒక‌వైపు.. గ్యాంగ్ స్ట‌ర్స్ పేరు ఉప‌యోగించుకుని బెదిరింపులు మ‌రోవైపు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ని అత‌డి కుటుంబీకుల్ని చంపేస్తామంటూ బెదిరిస్తూ ఇంత‌కుముందు పంజాబీ గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు అందాయి. ముంబైలోని ట్రాఫిక్ పోలీస్ కార్యాల‌యాల‌కు బెదిరింపు ఈమెయిల్స్ అంద‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం సృష్టించింది. స‌ల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖ్ హ‌త్య భ‌యాందోళ‌న‌ల‌ను పెంచింది.

దీని త‌ర్వాత మ‌రో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై అగంతుకుడి దాడి, క‌త్తిపోట్ల వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది.. అదే నిందితుడు ఇంత‌కుముందు షారూఖ్ ఇంటి వ‌ద్ద కూడా రెక్కీ నిర్వ‌హించాడు. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో పలువురు బాలీవుడ్ న‌టుల‌కు హ‌త్యా బెదిరింపులు ఎదుర‌వ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పాపుల‌ర్ టీవీ హోస్ట్ కం హాస్య‌న‌టుడు కపిల్ శర్మకు పాకిస్తాన్ నుండి ఈమెయిల్ ద్వారా హత్యా బెదిరింపు ఎదురైంద‌ని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో బెదిరింపు మెయిల్స్ అందుకున్న రాజ్‌పాల్ యాదవ్, సుగంధ మిశ్రా, రెమో డిసౌజా వంటి సినీసెల‌బ్రిటీల‌ బృందంలో ఇప్పుడు కపిల్ శర్మ చేరారు. బిఎన్‌ఎస్ సెక్షన్ 351(3) కింద గుర్తుతెలియని దుండ‌గుడిపై అంబోలి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. ప్ర‌స్తుతం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్ నుంచి వ‌చ్చిన ఈమెయిల్‌లో ``మేము మీ ఇటీవలి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాం. సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం ముఖ్యమని న‌మ్ముతున్నాం. ఇది పబ్లిసిటీ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం కాదు. ఈ సందేశాన్ని జాగ్ర‌త్త‌గా, గోప్యంగా ఉంచాల‌ని మిమ్మల్ని కోరుతున్నాం`` అని ఈమెయిల్ లో రాసి ఉంది. ఈ బెదిరింపు లేఖ‌ను పంపిన వ్యక్తి `బిష్ణు` అని సంతకం చేశారు. అంతేకాదు స‌ద‌రు సెల‌బ్రిటీల‌ నుండి ఎనిమిది గంటల్లోపు సమాధానం ఇవ్వాల‌ని కూడా బెదిరింపు లేఖ‌లో కోరారు. లేకుంటే వారు వ్యక్తిగత, వృత్తిపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుద‌ని హెచ్చ‌రించ‌డం క‌ల‌క‌లం రేపింది.

తాజా ప‌రిణామానికి హ‌డ‌లెత్తిన హాస్యనటుడు కపిల్ శర్మ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కపిల్ త‌ర‌హాలోనే ఇంత‌కు ముందు న‌టి సుగంధ మిశ్రా, ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ రెమో డిసౌజా కూడా అదే త‌ర‌హా ఈమెయిల్ అందుకున్న తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. న‌టుడు రాజ్‌పాల్ యాదవ్‌కు గత సంవత్సరం డిసెంబర్ 14న ఈ మెయిల్ వచ్చింది. డిసెంబర్ 17న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమెయిల్ రాజ్‌పాల్ యాదవ్ స్పామ్ మెయిల్ బాక్స్ కు చేరుకుందని తెలుస్తోంది.

సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ బెదిరింపు ఈమెయిల్స్ వ‌స్తున్నందున ముంబై పోలీసులు ఈ ఫిర్యాదులను చాలా సీరియ‌స్ గా తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో ముంబై బాంద్రా ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపారు. బాబా సిద్ధిఖ్ బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి అత్యంత స‌న్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. స‌ల్మాన్ కి, అత‌డి చుట్టూ ఉన్న‌వారికి థ్రెట్ ఎటువైపు నుంచి వ‌స్తుందో తెలీని ప‌రిస్థితి. ఇటీవ‌ల‌ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు బెదిరింపులు మ‌రింత ఎక్కువ‌య్యాయి. బాబా సిద్ధిఖ్ హత్యకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా బాధ్యత వహిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సల్మాన్ ఖాన్ కి వై కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. వ్య‌క్తిగ‌తంగాను అత‌డు త‌న వైపు నుండి భద్రతను పెంచుకున్నాడు. అతడి బాల్కనీలో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలను కూడా ఏర్పాటు చేసుకున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. మ‌రోవైపు సెల‌బ్రిటీల‌ను ఆడియో వేడుక‌ల్లో అతిథులుగా పిలిచి దారి మార్గంలో దోపిడీకి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు కూడా ఇంత‌కుముందు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మీరే మా ఈవెంట్ కి ముఖ్య అతిథి అంటూ విమానం టికెట్లు పంపి, అడ్వాన్స్ అంద‌జేసి మ‌రీ కిడ్నాప్ చేసారు. బెదిరించి ప‌లువురు న‌టుల నుంచి డ‌బ్బు గుంజారు. హాస్య‌న‌టులు ముస్తాక్ ఖాన్, సునీల్ పాల్, నటుడు ముస్తాక్ మహ్మద్ ఖాన్ ల‌ను దారి మ‌ళ్లించి కిడ్నాప్ చేసి బందీలుగా ఉంచి వారి నుంచి డ‌బ్బు గుంజిన ఘ‌ట‌న‌లు ద‌డ పుట్టించాయి. వ‌రుస ఘ‌ట‌న‌లు చూస్తుంటే, బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు అరిష్టం ప‌ట్టుకున్న‌ట్టే క‌నిపిస్తోంద‌ని ప‌లువురు ఆందోళ‌న చెందుతున్నారు.

Tags:    

Similar News