టిప్పు సుల్తాన్ జీవితం పై సినిమా.. నిర్మాతకు బెదిరింపులు!
ఈరోజు నిర్మాత సందీప్ సింగ్ హజ్రత్ టిప్పు సుల్తాన్ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మనోభావాలు దెబ్బ తినడం అనేది పెద్ద సమస్య. సృజనాత్మక రంగం లో ఇది పెనువిస్పోటనంగా మారుతోంది. ఇటీవల మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జీవితం పై సినిమా ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా దర్శక నిర్మాతల కు అన్ని ప్రాంతాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. చివరికి చిత్రనిర్మాత దిగి వచ్చి సినిమా ని రద్దు చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు నిర్మాత సందీప్ సింగ్ హజ్రత్ టిప్పు సుల్తాన్ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హజ్రత్ టిప్పు సుల్తాన్ పై సినిమా తీయబోమని తన ప్రకటనలో వెల్లడించారు.
ఒక సుదీర్ఘ నోట్ లో అతడు క్షమాపణలు చెప్పారు. "నన్ను నా కుటుంబం స్నేహితుల ను బెదిరించడం ఆపండి. నా తోటి సోదరులు సోదరీమణులను నేను దయ చూపమని అభ్యర్థిస్తున్నాను. నేను అనుకోకుండా మతపరమైన మనోభావాల ను గాయపరిచి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. అన్ని విశ్వాసాల ను నేను గౌరవిస్తాను కాబట్టి.. ఎవరి మనోభావాల ను దెబ్బ తీయడం నా ఉద్దేశ్యం కాదు. భారతీయులుగా మనం ఎప్పటికీ ఐక్యంగా ఉందాం. ఎల్లప్పుడూ ఒకరికొకరు గౌరవం ఇద్దాం! -ప్రేమతో మీ సందీప్ సింగ్..`` అంటూ సుదీర్ఘ నోట్ ని విడుదల చేసారు.
ఇంతకుముందు టిప్పు సుల్తాన్ పై సందీప్ సినిమా ప్రకటించినప్పుడు ఆ సందర్భం లో పలు ఆసక్తికర విషయాల ను అతడ ప్రస్థావించారు. "నా సినిమాలు నిజం కోసం నిలుస్తాయని.. మన చరిత్ర పాఠ్యపుస్తకాలలో చూపిన విధంగా అతడు(టిప్పు సుల్తాన్) ధైర్యవంతుడని నమ్మాలని ప్రయత్నించాక నా బుర్ర వాచిపోయింది. నిజానికి సుల్తాన్ దుర్మార్గపు కోణం ఎవరికీ తెలియదు. భవిష్యత్ తరానికి అతడి లోని చీకటి కోణాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాను.."
అని సందీప్ అన్నారు. దర్శకుడు పవన్ శర్మ మాట్లాడుతూ-"టిప్పు సుల్తాన్ గురించి మనకు పాఠశాల లో బోధించినది చాలా తప్పుడు సమాచారం. మూర్ఖపు రాజు అయిన అతడి నైజాన్ని వాస్తవాల ను తెలుసుకోవడం కోసం నేను చాలా వెతికాను. నిజానికి నేను భ్రమపడ్డాను. అతడిని యోధుడిగా ఆవిష్కరించడానికి తారుమారు చేసిన క్రూరమైన వాస్తవికతను నా సినిమా ద్వారా చూపించడానికి ధైర్యం చేస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రకటనల అనంతరం సందీప్ సహా చిత్రబృందానికి బెదిరింపులు ఎదురయ్యాయి. వారి కుటుంబ సభ్యుల ను బెదిరించడంతో ఇప్పుడు ఈ సినిమా ని ఆపివేస్తున్నట్టు ప్రకటించారు.