ఇండస్ట్రీ ఇక జూనియర్లదేనా..కొన్నాళ్లిక తిరుగులేదు!
ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్లు చాలా మంది ఇప్పటికే సైడ్ అవుతున్నారు. చాలా కాలంగా విజయాలు లేక పోవడంతో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది
ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్లు చాలా మంది ఇప్పటికే సైడ్ అవుతున్నారు. చాలా కాలంగా విజయాలు లేక పోవడంతో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనువైట్ల, పూరి జగన్నాధ్ లాంటి సీనియర్లు ఇంకా సినిమాలు చేస్తున్నా సరైన విజయాలు పడటం లేదు. దీంతో స్టార్ హీరోలు అవకాశాలిచ్చే పరిస్థితి కనిపించలేదు. ఉన్న హీరోలంతా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నారు. టైర్ -2 హీరోలంతా కొత్త తరం..ఫాంలో ఉన్న దర్శకుల్ని చూజ్ చేసుకుంటున్నారు.
దీంతో చాలా మంది సీనియర్లకు అవకాశాలు రావడం కష్టంగా మారింది. ఇప్పటికే వి.వివినాయక్, బొమ్మరిల్లు భాస్కర్, కృష్ణ వంశీ లాంటి వారు ఇండస్ట్రీకి దూరమయ్యారు. వాళ్ల తర్వాత జనరేషన్ డైరెక్టర్లలో సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, రాజమౌళి, త్రివిక్రమ్ వీళ్లంతా బిజీ డైరెక్టర్లు. ఇక వీళ్ల తర్వాత ఇండస్ట్రీ ఎవరిది అంటే కొత్త తరం దర్శకుల పేర్లే వినిపిస్తున్నాయి.
వెంకీ అట్లూరీ, దసరా ఫేం శ్రీకాంత్, ప్రశాంత్ వర్మ, సుజిత్, శైలేష్ కొలను, రాహుల్ సంకృత్యన్, శివ నిర్వాణ, మారుతి, సందీప్ రెడ్డి వంగా, వెంకీ కుడుమల, అనీల్ రావిపూడి లాంటి వారు ఫాంలో ఉన్నారు. వీళ్లంతా న్యూ ఏజ్ డైరెక్టర్లగా సక్సెస్ అవుతున్నారు. ఒక్కో డైరెక్టర్ లో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎవరి స్టైల్లో వారు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన సుజిత్-సందీప్, కార్తీక్ వర్మ దండు, వశిష్ట లాంటి వారు డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసి సక్సెస్ అయిన వారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో వీళ్లు స్పెషలిస్ట్ లు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ జానర్ సినిమాలకు మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఇలాంటి కథలు ఎప్పుడొస్తాయా? అని ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరో..అభిమాన హీరో సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు కొత్త కంటెంట్ ఎవరిస్తారు? అని దర్శక వివరాలు ఆరా తీసి మరి జనాలు థియేటర్ కి వెళ్తున్నారు. ముందు ముందు ఈ డైరెక్టర్లు అంతా ఇంకా అప్ డేట్ గా సినిమాలు చేయాలి. కంటెంట్ పాత బడితే సీనియర్ల జాబితాలో కలిసి పోవాల్సి వస్తుంది.