2024 రివ్యూ: పాన్ ఇండియాలో టాలీవుడ్ ఆధిపత్యం!
దక్షిణాదిన కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయి.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియాను ఏల్తున్న పరిశ్రమ ఏది? దక్షిణాదిన కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇతర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ డామినేషన్ అన్నిటా స్పష్ఠంగా కనిపిస్తోంది. 2024లో విడుదలైన సినిమాలను సమీక్షిస్తే, తెలుగు చిత్రసీమ నుంచి విడుదలైన 'కల్కి 2898 ఎడి' ఫుల్ రన్‌లో 1100 కోట్ల వసూళ్లతో సిసలైన పాన్ ఇండియా విజయం అందుకుంది. ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఇది ఒకటి.
ఏడాది చివరిలో విడుదలైన పుష్ప 2 ఇప్పటికే 1300 కోట్ల వసూళ్లు సాధించి, రెండో వారంలోను భారీ వసూళ్లను సాధిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డులకెక్కింది. ఈ రెండిటికి మధ్యలో విడుదలైన ఎన్టీఆర్ 'దేవర' 400 కోట్ల వసూళ్లను సాధించగా, ఉత్తరాది బెల్ట్ నుంచి భారీ వసూళ్లు దక్కాయి.
వీటన్నిటికీ ధీటుగా ప్రశాంత్ వర్మ- తేజ సజ్జాల హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై ఏకంగా 350 కోట్ల గ్రాస్ వసూలు చేయడం సంచలనం. వీటికి అదనంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 200 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఓవరాల్ గా టాలీవుడ్ 3400 కోట్ల వసూళ్లను కేవలం ఐదు సినిమాలతో సాధించింది. 2024లో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ స్పష్ఠమైన హవా సాగించిందనడానికి ఈ ఫలితాన్ని చూస్తే చాలు.
కోలీవుడ్‌లో ఈ ఏడాది ప్రథమార్థం చప్పగా సాగితే, ద్వితీయార్థంలో కొన్ని అద్భుతమైన విజయాలు దక్కాయి. ముఖ్యంగా 'అమరన్' లాంటి బయోపిక్ చిత్రం కోలీవుడ్ గౌరవాన్ని పెంచగలిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 250 కోట్ల గ్రాస్ వసూలు చేయడం పరిశీలించదగినది. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, ఉత్తరాది బెల్ట్ లోను ఈ సినిమాకి ఆదరణ దక్కడం వల్లనే ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి. విజయ్ సేతుపతి నటించిన మహారాజా 100 కోట్లు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చియాన్ 'విక్రమ్' నటించిన 'తంగళన్' పరిశ్రమకు గౌరవప్రదమైన విజయాన్ని అందించింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో నిలిచింది. వాజై, డిమొంటే కాలనీ-2, లబ్బర్ పండు, మెయ్యళగన్, బ్లాక్ లాంటి మధ్యస్త బడ్జెట్ చిత్రాలు కోలీవుడ్ కి చక్కని విజయాల్ని అందించాయి. అగ్ర హీరోలు ఎవరూ ఆశించినంత పెద్ద విజయాల్ని ఇవ్వలేదు. విజయ్ - గోట్, ధనుష్ - రాయన్, రజనీకాంత్ - వేట్టయ్యాన్, సూర్య - కంగువ, కమల్ హాసన్ - ఇండియన్ 2 ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయాయి. కోలీవుడ్ నుంచి 500-1000 కోట్ల మధ్య వసూలు చేసిన సినిమా ఒక్కటీ రాలేదు. కానీ పాన్ ఇండియన్ ప్రేక్షకులలో చర్చగా మారినవి కొన్ని ఉన్నాయి.
2024లో కన్నడ సినీపరిశ్రమ నుంచి పెద్దగా సౌండ్ చేసిన సినిమా ఏదీ రాలేదు. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ రచనా సహకారం అందించిన 'భగీర' చిత్రం గురించి పాన్ ఇండియాలో చర్చ సాగింది. శ్రీమురళి, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్డిట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ కన్నడ సినిమాల్లో భగీరకు మాత్రమే చోటు దక్కింది. అయితే 'భగీర' కంటే చాలా చిన్న సినిమాలు కన్నడంలో మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇతర దక్షిణాది పరిశ్రమలతో పోలిస్తే ఈ ఏడాది పాన్ ఇండియాలో టాలీవుడ్ హవా స్పష్ఠంగా కనిపించింది.