టాలీవుడ్‌లో ఫైనాన్స్ మిస్టరీ: 2.25% వడ్డీకి ఇచ్చే ఈ రంగయ్య ఎవరు?

సత్య రంగయ్య పేరు బయట పెద్దగా వినిపించకపోయినా, టాలీవుడ్‌ లోపల మాత్రం ఆయన పేరు దాదాపు అందరి నిర్మాతలకు తెలుసు.

Update: 2025-01-21 11:19 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదాయ పన్ను శాఖ సోదాలు పెరుగుతుండటంతో టాలీవుడ్‌కి చెందిన పెద్ద నిర్మాతలు, ఫైనాన్షియర్లు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బడా నిర్మాతలు వారితో లింక్స్ ఉండే సన్నిహితులపై ఫైనాన్స్ ఇచ్చే వారిపై కూడా రెయిడ్స్ జరిగాయి. అయితే అందులో ప్రముఖ ఫైనాన్షియర్‌ సత్య రంగయ్య పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. గత 40 ఏళ్ళుగా ఈ రంగంలో కొనసాగుతూ, పెద్ద నిర్మాతలకి ఆర్థిక సాయం అందిస్తున్న సత్య రంగయ్యపై ఐటీ దృష్టి పడటం, హాట్ టాపిక్ గా మారింది.

సత్య రంగయ్య పేరు బయట పెద్దగా వినిపించకపోయినా, టాలీవుడ్‌ లోపల మాత్రం ఆయన పేరు దాదాపు అందరి నిర్మాతలకు తెలుసు. ధర్మవరం, అనంతపురం జిల్లాకు చెందిన ఈ వ్యక్తి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ కాలం నుండి చిత్రాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలకు పన్ను దాదాపు 2.25% వడ్డీతో ఆర్థిక సాయం అందించడం ఆయన ప్రత్యేకత.

క్యాష్ తోనే రెగ్యులర్ ప్రొడక్షన్ పనులు జరగాలి కాబట్టి ఎక్కువగా ప్రముఖ నిర్మాతలు కూడా ఫైనాన్స్ ద్వారానే షూటింగ్ ఖర్చులు కవర్ చేసేవారు. అయితే ఒకప్పుడు చిత్రాలకు ల్యాబ్ లెటర్స్‌పైన ఆధారపడి ఫైనాన్స్ అందించేవారు. సినిమా విడుదలకు ముందు నిర్మాతల వద్ద నుండి "నో డ్యూస్" లెటర్స్ తీసుకోవడం సర్వసాధారణంగా ఉండేది. అయితే, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువగా ఉంటే ల్యాబ్ లెటర్ ద్వారా ఫైనాన్స్ చెల్లింపులు నిలిచిపోయేవి.

కానీ, ఇప్పుడు ఫైనాన్సింగ్ మోడల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఓటీటీ అగ్రిమెంట్‌లు, హిందీ మార్కెట్‌ డీల్‌లు ప్రధానంగా మారాయి. నిర్మాత పేరు, ఆర్థిక స్థితిని కూడా పరిశీలిస్తారు. అన్ని సెట్టయితేనే ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సరిపోకపోతే, సినిమా డీల్స్ ను పక్కన పెట్టడం ఫైనాన్సియర్లకు సర్వసాధారణమైంది. గతంలో బ్యాంకులు ఈ రంగంలో పెద్దగా పాదముద్ర వేయలేదు. కానీ ఇప్పుడు, ఐసిఐసిఐ వంటి బ్యాంకులు ఓటీటీ ఒప్పందాల ఆధారంగా తక్కువ వడ్డీతో ఫైనాన్స్ అందిస్తుండటంతో నిర్మాతలు ఆ మోడల్‌ని ఎంచుకుంటున్నారు.

గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దిల్ రాజును ఐటీ విభాగం ఫోకస్ చేయడానికి కారణమయ్యాయని తెలుస్తోంది. నిర్మాతల సంస్థ ఆర్థిక పరిస్థితి మరీ అసమానంగా ఉండటంతో, ఫైనాన్స్ ఎలా సమకూర్చారనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. సత్య రంగయ్య ప్రసాద్ ఈ చిత్రం విడుదలకు చివరి నిమిషంలో పెద్ద భరోసా అందించారనే టాక్‌ వినిపిస్తోంది. సినిమా విడుదలకు అడ్డుగా నిలిచి, ఇతర ఫైనాన్సియర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

దిల్ రాజు కంపెనీతో లింక్స్ ఉన్న మ్యాంగో రామ్, సినిమా థర్డ్ పార్టీ డీల్‌లను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద బడ్జెట్ చిత్రాలకు చెందిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ డీల్‌లలో కదలికలపై ఐటీ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఫైనాన్స్‌కు సంబంధించిన కొన్ని లొసుగులు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

కొన్ని సినిమాలకు లెక్కకు మించి ఖర్చు చేయడం, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వంటి అంశాలు పరిశ్రమను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, ఈ సోదాల వల్ల సినిమాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ఈ ఐటీ సోదాలు, ఫైనాన్స్ వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన లావాదేవీలు మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ దాడులు పరిశ్రమలో ఆర్థిక నిబద్ధతను పెంపొందించడంలో కీలకమైన పాత్ర పోషించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News