రివైండ్ 2023: 90 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో తొలి ఘనత!
ఈ ఏడాది కేవలం జాతీయ అవార్డ్ మాత్రమే కాదు.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ మన ప్రతిభను వరించింది.
భారతీయ సినిమా 100 ఏళ్లు పైబడిన చరిత్రను కలిగి ఉంది. ఇందులో 90ఏళ్ల చరిత్ర టాలీవుడ్ కి ఉంది. దశాబ్ధాల చరిత్రలో టాలీవుడ్ ఎందరో సూపర్ స్టార్లను ఉత్పత్తి చేసింది. కానీ వీళ్లలో ఎవరూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎవరికీ గౌరవం దక్కలేదు. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ చలనచిత్రసీమ అని భావించేవారు. అసలు దక్షిణాది సినీపరిశ్రమలకు గుర్తింపు అన్నదే లేదు. పైగా ఇక్కడి స్టార్లను వారంతా చులకనగా చూసేవారు. కానీ 2023 చరిత్రను మార్చిన సంవత్సరంగా ఘనుతికెక్కింది. ఈ ఏడాది కేవలం జాతీయ అవార్డ్ మాత్రమే కాదు.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ మన ప్రతిభను వరించింది. పాపులర్ గోల్డెన్ గ్లోబ్ నట్టింటికి వచ్చింది. హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారం దక్కింది. ఇదే ఏడాది జాతీయ అవార్డులు సైతం టాలీవుడ్ సినిమాలను వరించాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను గెలుచుకుని తెలుగువాడి సత్తాను ప్రపంచ సినీయవనికపై చాటింది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కడం, అటుపై ఇతర ప్రముఖ అవార్డులను గెలుచుకోవడం సంచలనమైంది. భారతదేశానికి అధికారికంగా మొట్టమొదటి ఆస్కార్ పురస్కారాన్ని తెచ్చిన ఘనత టాలీవుడ్ కే చెందుతుంది.
అదంతా అటుంచితే ఇప్పుడు దిల్లీ మనవైపు తిరిగి చూసేలా.. తెలుగోడి సత్తా అంటే ఏంటో చాటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భారతీయ సినీచరిత్రలో తెలుగు సినిమా ఉన్నంత కాలం స్మరించుకునేలా.. బన్ని జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని అందుకున్నాడు. దశాబ్ధాల ఘనచరిత కలిగి ఉన్న టాలీవుడ్ కి ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డు రావడం ఇదే మొదటిసారి. దిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్ జాతీయ పురస్కార ట్రోఫీని అందుకున్నాడు. `పుష్ప` చిత్రంలో పుష్పరాజ్ పాత్రకు దక్కిన అరుదైన గౌరవమిది. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్ని నటన అనన్య సామాన్యం. అతడి నటన ఆహార్యం డైలాగ్స్ డ్యాన్సులు ఫైట్స్ ఇలా ప్రతిదీ ప్రజల మనసుల్ని గెలుచుకున్నాయి. అందుకే జూరీ పోటీలో ఉన్న ఇతర సినిమాల్ని వాటిలో నటించిన హీరోల్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ కి పట్టంగట్టింది. ఒక కమర్షియల్ సినిమాలో మాస్ హీరోగా బన్నీ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకోవడం సినిమా హిస్టరీలోనే సంచలనం అని చెప్పాలి.
ఆర్.ఆర్.ఆర్ కు జాతీయ అవార్డులు
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు (కీరవాణి), ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ (కింగ్ సాలమన్), ఉత్తమ కొరియోగ్రాఫర్ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ నేపథ్య గాయకుడు (కాలభైరవ), ఉత్తమస్పెషల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్) విభాగాల్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రం జాతీయ అవార్డులు అందుకుంది. ఆర్.ఆర్.ఆర్ కమర్షియల్ గా ఘనవిజయం సాధించడమే గాక జాతీయ అవార్డులతో మోత మోగించింది.
మైత్రి సంస్థకు జాతీయ గుర్తంపు:
2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా మైత్రి సంస్థ నిర్మించిన `ఉప్పెన` జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి మంచి పేరొచ్చింది. ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం)కు జాతీయ అవార్డ్ దక్కింది. 2023 అవార్డుల పరంగా ఎంతో కలిసొచ్చిన సంవత్సరం. కేవలం అవార్డులే కదా! అని తీసి పారేయకపోతే, ఈ అవార్డుల వల్లనే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.