వీరమల్లు.. అంతా ఓకే కానీ..
పవన్ సినిమా షూటింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ ఇంకా స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఆయన పటుత్వాన్ని కోరుకుంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరహర వీరమల్లు కూడా ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. నిజానికి ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగే సరిగా జరగలేదు. తరచూ షూటింగ్స్ వాయిదా పడుతూ వస్తుండటంతో, ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే, మూవీ ఆగలేదు అని ఆయన పుట్టిన రోజు నాడు ఇచ్చిన అప్ డేట్ తో క్లారిటీ వచ్చింది.
అయితే,కొద్ది రోజుల క్రితం ఈ మూవీ కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ఆ వార్తల సారాంశం. పవన్ డేట్స్ కోసం మేకర్స్ కోరగా, ఆయన అంగీకరించారు అని అనుకున్నారు. దీంతో, సినిమా త్వరగానే థియేటర్స్ లోకి అడుగుపెడుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది.
నిర్మాత రత్నం స్వయంగా హరహరవీర మల్లుపై ఓ అప్ డేట్ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమా ఈవెంట్ కి వచ్చిన ఏఎం రత్నం, ఇప్పట్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ పీరియాటిక్ డ్రామా అని, మూవీలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయని, వాటికి చాలా సమయం పడుతుందని చెప్పారు. కానీ, షూటింగ్ జరగడం లేదు అని మాత్రం చెప్పలేదు.
పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలుసు అని, ఆయన తన రాజకీయ పార్టీ నిధుల కోసం సినిమాలు చేస్తున్నాడని ఆయన అన్నారు. అందుకే, ఎక్కువ రీమేక్ సినిమాలు చేస్తున్నారని చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తేదీలు, లభ్యతను బట్టి, తమ సినిమాను పూర్తి చేసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికల సమయానికి షూటింగ్ పూర్తి చేసి, మూవీ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన చెప్పింది అంతా బాగానే ఉంది కానీ హరిహర వీరమల్లు సినిమా ఆగిపోవడానికి అసలు కారణం, స్క్రిప్ లో వచ్చిన సమస్యలే అని ఆ మధ్య చాలా రకాల టాక్స్ అయితే వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇంకా స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేడు అనే కథనాలు కూడా వచ్చాయి. అయితే క్రిష్ మాత్రం పట్టు విడవకుండా కథనంలో చాలావరకు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పవన్ సినిమా షూటింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ ఇంకా స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఆయన పటుత్వాన్ని కోరుకుంటున్నాడు.
పక్క ప్రణాళికతో మంచి చేంజెస్ చేస్తూ సిద్ధమైతే గనక పవన్ డేట్స్ ఇవ్వడానికి సిద్ధమే ఉన్నాడు. కానీ పవన్ రెడీగా ఉన్న సమయానికి క్రిష్ ఏమాత్రం ఆలస్యం చేసిన కూడా మళ్లీ చాలా ఎక్కువ కాలం షూటింగ్ కు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో క్రిష్ జెట్ స్పీడ్ లో మెచ్చుకునే విధంగా తన ప్లాన్ సిద్ధం చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక, ఈ సినిమా మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే వ్యక్తి కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. అదేవిధంగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ లాంటి నటులు ఉన్నారు.