టాలీవుడ్.. అమెరికాలో మిలియన్ రికార్డులు కష్టమేనా?
గతంలో మిలియన్ మార్క్ సాధించడం సాధారణమైన విషయంగా మారినప్పటికీ, ఇప్పుడు అది కష్టంగా మారుతోందా? అనే సందేహం తెరపైకి వచ్చింది.
తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్‌గా విస్తరించినప్పటికీ, ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ ఆదరణ ఉంది. ఓ చిన్న సినిమా అయినా సరే, యూఎస్‌లో ప్రీమియర్ షోలు, వీకెండ్ కలెక్షన్లు ఎంతటి ప్రభావం చూపుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాజిటివ్ టాక్ వస్తే మీడియం రేంజ్ సినిమాలు కూడా రికార్దు స్థాయిలో వసూళ్ళను అందుకునేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. గతంలో మిలియన్ మార్క్ సాధించడం సాధారణమైన విషయంగా మారినప్పటికీ, ఇప్పుడు అది కష్టంగా మారుతోందా? అనే సందేహం తెరపైకి వచ్చింది.
ఈ మార్పుకు ప్రధాన కారణం అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీలేనా అనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని విధానాలు విద్యార్థులకు కఠినంగా మారాయి. ముఖ్యంగా పార్ట్ టైమ్ ఉద్యోగాల విషయంలో నియంత్రణలు పెరిగాయి. ఇటీవల అమెరికాలో తెలుగు విద్యార్థులపై అధికారులు నిర్వహించిన తనిఖీలు, వారిపై తీసుకుంటున్న చర్యలు అక్కడి విద్యార్థుల ఆదాయాన్ని తగ్గించాయని చెబుతున్నారు. దీంతో, సినిమా థియేటర్లకు వెళ్లే వారు కరువవుతున్నారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజాగా విడుదలైన తండేల్ సినిమా ఈ మార్పుకు ఉదాహరణగా నిలుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్, బ్లాక్‌బస్టర్ సాంగ్స్, ప్రీమియర్ షోలపై హైప్ ఉన్నప్పటికీ, ఈ సినిమా యూఎస్‌లో ఇప్పటివరకు కేవలం $700K+ మాత్రమే వసూలు చేసింది. సాధారణంగా ఇలాంటి సినిమాలు మిలియన్ మార్క్‌ను వేగంగా దాటతాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఇది కేవలం ఒకే ఒక్క సినిమాపైనే ప్రభావం చూపుతోందా లేక రాబోయే సినిమాలకూ ఇదే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ నియంత్రణలతో పాటు, టికెట్ ధరలు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికాలో పెద్ద సినిమాల ప్రీమియర్ షోలకు పెంచిన టికెట్ ధరలు ఇప్పటివరకు వర్కౌట్ అయ్యాయి. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆదాయం తగ్గిన నేపథ్యంలో, వారి థియేటర్ వసూళ్లపై కూడా ప్రభావం పడుతుందా? అనే ప్రశ్న ముందుకొచ్చింది.
రాబోయే పెద్ద సినిమాలు ఈ పరిస్థితిని తట్టుకుని జెట్ స్పీడ్ లో మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయగలవా లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇక ఈ ప్రభావం మరింత సీరియస్ గా మారితే అమెరికాలో తెలుగు సినిమా బిజినెస్‌లో తగ్గుదల చూడాల్సి వస్తుందని చెప్పవచ్చు. బయ్యర్లు డీల్స్ విషయంలో రిస్క్ చేయడానికి వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ పరిస్థితులకు సమాధానం తెలియాలంటే మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ వరకు ఆగాల్సిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో.