కష్టపడ్డా బజ్ ఏది?.. ఇలా అయితే కష్టం!
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు సైతం వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు రాబడుతున్నాయి
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు సైతం వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు రాబడుతున్నాయి. మీడియం బడ్జెట్ తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల వసూళ్లు రాబడితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు దిశగా పరుగులు తీస్తుంది. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ మంచి సినిమాలు వస్తున్నాయి... భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. వందల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే నిలబడుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలను సైతం హిందీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు హిందీ సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో ఛారిత్రాత్మక సినిమాలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా పద్మావత్, బాజీరావు మస్తానీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. అయితే కరోనా తర్వాత వచ్చిన హిందీ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో బాలీవుడ్‌లో సూపర్ హిట్ దక్కించుకున్న సినిమాలను వేల్లమీద లెక్కించొచ్చు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన 'చావా' సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు.
చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంబాజీ మహారాజ్ కథతో 'చావా' అనే టైటిల్‌తో రూపొందించారు. ఇప్పటి వరకు శంబాజీ గురించి హిందీ ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు. సినిమాల రూపంలో వచ్చింది చాలా తక్కువ. అందుకే ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంను మేకర్స్ మొదటి నుంచి కలిగి ఉన్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. విక్కీ కౌశల్ ఈ సినిమాలో శంబాజీ పాత్రలో నటించాడు. శంబాజీ భార్య పాత్రను రష్మిక మందన్న పోషించిన విషయం తెల్సిందే. సినిమాను డిసెంబర్‌లోనే విడుదల చేయాలని మొదటి భావించినా తీవ్ర పోటీ మధ్యలో విడుదల వద్దనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు.
సోలో రిలీజ్ దక్కించుకున్న చావా సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయలేక పోయింది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకు సినిమాకు బజ్ క్రియేట్ కాలేదని అడ్వాన్స్ బుకింగ్ లెక్కలను చూస్తే అర్థం అవుతుంది. ఈ మధ్య కాలంలో హిందీలో వచ్చిన సినిమాలన్నింటికి ఇదే పరిస్థితి నెలకొంది. అయితే చావా సినిమా స్పెషల్ అని, కచ్చితంగా ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి కలుగుతుందని మేకర్స్ భావించారు. కానీ సినిమా విడుదల అయ్యేంత వరకు వెయిట్ చేసి, హిట్ టాక్ వస్తే అప్పుడు చూద్దాం అని చాలా మంది ఆలోచనలో ఉన్నారు.
అందుకే ప్రస్తుతానికి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అంతంత మాత్రంగానే వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా విక్కీ కౌశల్, రష్మిక మందన్న ఇతర యూనిట్ సభ్యులు చాలా కష్టపడ్డా ఫలితం దక్కడం లేదు. ఇదే బజ్ కంటిన్యూ అయితే ఓపెనింగ్స్ కష్టమే అని, ఫలితం తారు మారు అయితే డిజాస్టర్ కలెక్షన్స్ నమోదు చేసే ప్రమాదం ఉందనే అభిప్రాయంను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.