టీజర్.. తగలబెట్టేసేలా విజయ్ 'కింగ్‌డమ్'
ఎప్పుడూ కొత్తదనం అందించాలనే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ మరోసారి తన స్టైల్ మార్చాడు.
ఎప్పుడూ కొత్తదనం అందించాలనే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ మరోసారి తన స్టైల్ మార్చాడు. నెక్స్ట్ రానున్న VD12 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైటిల్ టీజర్ విడుదల కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కంటెంట్ కు తగ్గట్లే కింగ్‌డమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, కథలోని ఇంటెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే, విజయ్ దేవరకొండ ఈసారి తన అభిమానులకు హై వోల్టేజ్ యాక్షన్ డోస్ తో సరికొత్త ఫ్లేవర్ అందించబోతున్నాడు అని స్పష్టంగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ లో 'అలసట లేని భీకర యుద్ధం.. అలలుగా పారే ఎరుల రక్తం. వలసపోయినా.. అలసిపోయినా.. ఆగిపోనిది ఈ రణం... అంటూ ఒక ప్రాంతానికి సంబంధించిన ఊచకోత అంశాలను చూపించారు. చివరికి ఈ అలజడి ఎవరి కోసం అనే లైన్స్ హైలెట్ అవుతున్నాయి. అలాగే రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజుకోసం.. అని దేవరకొండ క్యారెక్టర్ ను పరిచయం చేశారు.
కాలాచక్రాన్ని బద్దలుకొట్టి పునార్జన్మనెత్తిన నాయకుడి కోసం అంటూ కథలో ఏదో న్యూ పాయింట్ ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్ కు పవర్ఫుల్ గా సెట్టయ్యింది. అలాగే విజయ్ దేవరకొండ ఖైదీల మధ్య ఉన్న తీరు, గట్టిగా అరిచే విధానం చూస్తుంటే తెలియని భావోద్వేగాలతో ఆ క్యారెక్టర్ ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అలాగే చివర్లో ఏమైనా చేస్తా సార్.. మొత్తం తగలబెట్టేస్తా అంటూ హీరో చెప్పిన మాటలు కూడా హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విజువల్స్ చూస్తుంటే అసలు జెర్సీ సినిమా తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీస్తోంది అనేలా డౌట్ రాకుండా ఉండదు. నిర్మాత నాగవంశీ చెప్పినట్లు.. గౌతమ్ KGF తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా.. అనేది నిజమయ్యేలా ఉంది.
విజువల్ ప్రెజెంట్‌షన్ అద్భుతంగా ఉండటంతో పాటు, ఇందులోని పవర్‌ఫుల్ డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా సీరియస్ టోన్‌ను పెంచేశాయి. తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ముగ్గురు స్టార్ హీరోలు తమ గొంతుతో టీజర్‌కి స్పెషల్ ఎలివేషన్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ట్రీట్మెంట్ టీజర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.
టీజర్ విడుదల అనంతరం, సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చింది. 2025 మే 30న కింగ్‌డమ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిత్రం కానుంది. ప్రేక్షకులు కూడా ఈ టీజర్‌ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.