దిల్ రాజు - దేవరకొండ.. ఈసారి యాక్షన్ ప్లాన్
విజయ్ దేవరకొండ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ లైనప్ ను సెట్ చేసుకుంటూ ఉన్నాడు.
విజయ్ దేవరకొండ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ లైనప్ ను సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్, రాబోయే రోజుల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో కూడా మరో సినిమా చేయాల్సి ఉంది. ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో క్లిక్ కాలేకపోయింది.
ఇక ఇప్పుడు దిల్ రాజుతో కలిసి విజయ్ దేవరకొండ 1980ల నేపథ్యంలోని యాక్షన్ చిత్రంలో నటించనున్నాడు. ప్రముఖ దర్శకుడు స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2025లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. సినిమా కథ, నటీనటులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, 80వ దశకానికి చెందిన యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అసలైతే దిల్ రాజు బ్యానర్ లో విజయ్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఒక సినిమా చేయాలి. కానీ ఆ ప్రాజెక్టు అనుకోని కారణాల వలన హోల్డ్ లో పడింది. ఇక దిల్ రాజు వెంటనే మరో దర్శకుడిని లైన్ లోకి తీసుకు వచ్చినట్లు సమాచారం.
మరోవైపు విజయ్ గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలా వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అలాగే సుకుమార్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ 3-4 ఏళ్ల తర్వాత మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో కూడా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఒక్కొక్కటీ పాన్ ఇండియా స్థాయిలో, యూనివర్సల్ కథాంశాలతో సినిమాలు చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నాడు. ఇక దిల్ రాజుతో చేయబోయే కొత్త సినిమా మాత్రం విజయ్ కెరీర్లో మరో కీలక ప్రాజెక్ట్‌గా మారబోతోందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ఒక అప్డేట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో విజయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఖైదీ పోస్టర్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా ఆ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.