దళపతి విజయ్ రికార్డుల వెనక నిజమైన షాడో
టీసిరీస్ అంతగా ఎగబడి ఆడియో రైట్స్
దళపతి విజయ్ సంచలనాలకు బ్రేక్ పడడం లేదు. అతడు నటించిన లియో త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా ప్రీరిలీజ్ బిజినెస్ లో సంచలనాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ లో ఈ సినిమా వ్యాపారం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇంతలోనే విజయ్ నటిస్తున్న 68వ సినిమా #దళపతి 68 ప్రీరిలీజ్ బిజినెస్ వేడి పెంచుతోంది. ఈ చిత్రానికి గ్యాంబ్లర్ (మాంగాత్త) దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ కి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన అతడు ఇప్పుడు విజయ్ కి బ్లాక్ బస్టర్ అందిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అదే క్రమంలో ఈ సినిమా కాస్టింగ్ సహా సాంకేతిక నిపుణుల ఎంపిక.. ప్రతిదీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజా సమాచారం మేరకు దళపతి 68 ఆడియో రైట్స్ ని రికార్డ్ ధరకు టీసిరీస్ ఛేజిక్కించుకుందని తెలుస్తోంది.
తమిళ సినీపరిశ్రమలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ దళపతి 68 బ్రేక్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా సినిమా రెగ్యులర్ చిత్రీకరణ అయినా ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో టాక్ వినిపించడంపై సందేహాలు నెలకొన్నాయి.
టీసిరీస్ అంతగా ఎగబడి ఆడియో రైట్స్ ని ఛేజిక్కించుకోవడానికి కారణం ఏమిటీ? అంటే... ఈ చిత్రానికి తమిళ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడమే కారణం. యువన్ - వెంకట్ ప్రభు కలయికలో పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ గతంలో వచ్చాయి. అవన్నీ యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీటవుతోంది అనగానే టీసిరీస్ రెండో ఆలోచన లేకుండా ఆడియో రైట్స్ ని రికార్డ్ ధరకు దక్కించుకుందన్న టాక్ వినిపిస్తోంది. యువన్ సంగీతం అందించిన మన్మధుడు (శింబు)- గ్యాంబ్లర్ (అజిత్) పాటలు తెలుగు యువతను ఉర్రూతలూగించాయి. బ్లాక్ బస్టర్ '7/జి బృందావన కాలనీ' పాటలు అయితే ఎప్పటికీ తెలుగు శ్రోతలకు మెమరబుల్ సాంగ్స్ గా రికార్డుల్లో నిలిచాయి.
యువన్ బాణీలు యూత్ కి కిక్కిచ్చాయి. అందుకే యువన్ శంకర్ సంగీతం అనగానే భాషతో సంబంధం లేకుండా సర్వత్రా ఆసక్తి నెలకొంది. యువన్ .. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. తమిళంలో అతడు టాప్ 5 సంగీత దర్శఖుల్లో ఒకరిగా ఏల్తున్నారు.