అప్పుల ఊబిలో ఉన్న హీరోని నిలబెట్టింది ఆ ఒక్క సినిమానే!
ఇది ఆయనకు కంబ్యాక్ మూవీ మాత్రమే కాదు, తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ ను గాడిలో పెట్టిన సినిమా అని చెప్పాలి.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు విజయాలు కొత్త కాదు. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం మాత్రం "విక్రమ్". రెండేళ్ల క్రితం వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇది ఆయనకు కంబ్యాక్ మూవీ మాత్రమే కాదు, తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ ను గాడిలో పెట్టిన సినిమా అని చెప్పాలి.
1981లో 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' పొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్.. తన బ్రదర్స్ తో కలిసి స్వీయ నిర్మాణంలో సినిమాలు తీస్తూ వస్తున్నారు. గతంలో అమావాస్య చంద్రుడు, అపూర్వ సోదరులు, సత్య, క్షత్రియ పుత్రుడు, ద్రోహి, భామనే సత్యభామనే లాంటి ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. అయితే వరుస పరాజయాలు పడటంతో, క్రమ క్రమంగా ఈ బ్యానర్ నుంచి సినిమాలు రావడం తగ్గిపోయింది.
కమల్ హాసన్ ఇతర బ్యానర్స్ లో నటించిన సినిమాలతో పాటుగా, సొంత ప్రొడక్షన్ లో చేసిన చిత్రాలు కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. RKFI పతాకంపై 'మరుదనాయగం' అనే భారీ చిత్రాన్ని పట్టలెక్కించి, ఆర్థిక సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేశారు. ఆ సమయంలో దాదాపు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. 'విశ్వరూపం' సినిమాతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఇండస్ట్రీలో అంతా చెప్పుకుంటారు.
అయితే 2022లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన "విక్రమ్" సినిమా కమల్ హాసన్ తో పాటుగా ఆయన నిర్మాణ సంస్థకు కూడా ఊపిరి పోసింది. ఈ చిత్రాన్ని కమల్ తన హోమ్ బ్యానర్ లోనే నిర్మించారు. సరైన దర్శకుడు, తగిన స్టోరీ, మంచి క్యారెక్టర్ పడితే తన బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉంటుందనేది చూపించారు. 300 కోట్లు కలెక్ట్ చేస్తానని చెప్పి మరీ హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ తీర్చేస్తానని, ఫ్రెండ్స్ కు సహాయం చేస్తానని కమల్ స్వయంగా చెప్పారు.
'విక్రమ్' తర్వాత 'కల్కి 2898 ఏడీ' మూవీలో నటించారు కమల్ హాసన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. ఇందులో ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాలో దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంది. అందుకే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లకి పైగా వసూలు చేసింది. దీని తర్వాత వచ్చిన 'భారతీయుడు 2' చిత్రం ఫ్లాప్ అయినా, కమల్ కెరీర్ మీద ప్రభావం చూపించలేదు. చాలా ఏళ్ళ క్రితం ఆగిపోయిన సినిమా కావడంతో, జనాలు కూడా అలానే ట్రీట్ చేశారు.
విక్రమ్ ఇచ్చిన ధైర్యంతో, లేటెస్టుగా 'అమరన్' సినిమాతో వచ్చారు కమల్ హాసన్. దీంట్లో ఆయన కథానాయకుడు కాదు. శివ కార్తికేయన్ హీరోగా, తన బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. కమల్ కు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీంతో ఇప్పుడు 'థగ్ లైఫ్' అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
'థగ్ లైఫ్' చిత్రాన్ని 2025 జూన్ 5న రిలీజ్ చేయనున్నట్లు నిన్న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. గతంలో ఆయన నటించిన చాలా సినిమాలు జూన్ లో వచ్చి మంచి విజయాలు సాధించాయి. రెండేళ్ల క్రితం 'విక్రమ్' సినిమా కూడా జూన్ 3న విడుదలైంది. ఆ సెంటిమెంటుతోనే ఇప్పుడు 'థగ్ లైఫ్' ని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూస్తుంటే రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ స్లో అండ్ స్టడీగా హిట్ ఫ్యాక్టరీగా మారుతోందని అర్థమవుతోంది. రానున్న రోజుల్లో విశ్వనటుడు ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.