'మెగా'కి 2024 కలిసొచ్చింది.. కొత్త ఏడాది ఎలా ఉంటుందో?
సినిమాల పరంగా కొందరు మెగా హీరోలకు విజయాలు దక్కకపోయినా.. ఇతర విషయాల ద్వారా మెగా కుటుంబానికి ఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
2024 చివరి రోజుకి వచ్చేశాం. మరికొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి, 2025కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పబోతున్నాం. గడిచిన ఏడాది కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూసుకుంటే, కొందరికి చేదు జ్ఞాపకాలను మిగిలిస్తే, మరికొందరికి తీపి గుర్తులను మిగిల్చింది. టాలీవుడ్ లో ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. సినిమాల పరంగా కొందరు మెగా హీరోలకు విజయాలు దక్కకపోయినా.. ఇతర విషయాల ద్వారా మెగా కుటుంబానికి ఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్' మెగాస్టార్ చిరంజీవిని వరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అలానే 2024లో చిరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూమెంట్స్ చేసిన ఒకే ఒక్క యాక్టర్ ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చెప్పారు. ప్రమాణస్వీకారం సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అలానే 'గేమ్ చేంజర్' అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కురాళ్ళు' సినిమా మంచి సక్సెస్ అయింది. ఇక నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో చోటు ఖరారైంది. వచ్చే ఏడాది కూటమి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో మెగా బ్రదర్స్ ముగ్గురూ మంత్రులుగా పని చేసిన ఘనత దక్కించుకుంటున్నట్లు అవుతుంది. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
ఇలా మెగా ఫ్యామిలీకి 2024 అనేక తీపి గుర్తులను మిగిల్చింది. అందుకే ఈ ఏడాది 'మెగా నామ సంవత్సరం' అని అభిమానుల పోస్టులు పెడుతున్నారు. ఇక 2025లో మెగా హీరోల నుంచి అనేక సినిమాలు రాబోతున్నాయి. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రం సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న 'హరి హర వీరమల్లు', OG సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సాయి దుర్గ తేజ్ 'SYG - సంబరాల ఏటిగట్టు' దసరాకి రిలీజ్ కానుంది. మరి వచ్చే సంవత్సరం మెగా హీరోలకు ఎలాంటి విజయాలు దక్కుతాయో, ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.