ఓటీటీలో ఈ అమ్మడు చాలా లక్కీ..!

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి బాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన ముద్దుగుమ్మ యామి గౌతమ్‌.

Update: 2025-02-25 06:50 GMT

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి బాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన ముద్దుగుమ్మ యామి గౌతమ్‌. ఈమె తండ్రి పంజాబీ సినిమాల దర్శకుడు ముఖేష్‌ గౌతమ్‌. తండ్రి మద్దతు లేకుండానే మోడలింగ్ ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు అడుగు పెట్టింది. బుల్లి తెర ద్వారా మొదట ఈ అమ్మడు నటన ప్రస్థానం మొదలు పెట్టింది. 2012లో తన మొదటి హిందీ సినిమా 'విక్కీ డోనర్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో మంచి గుర్తింపును ఈ అమ్మడు సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

తెలుగులోనూ యామి గౌతమ్‌ పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈమె నటించిన గౌరవం, యుద్దం, కొరియర్‌ బాయ్ కళ్యాణ్ సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో నటించిన పలు సినిమాల్లో ఒక్కటి కూడా కమర్షియల్‌గా హిట్‌ కాకపోవడంతో ఆ తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. కానీ హిందీ సినిమా ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా ఈ అమ్మడు కెరీర్‌లో నిలదొక్కకుంటూ ముందుకు సాగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు రెగ్యులర్‌ సినిమాలతో కంటే ఓటీటీ సినిమాలతో అలరిస్తూ వస్తుంది. తాజాగా ధూమ్‌ ధామ్‌ సినిమాతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఈమధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా 'ధూమ్‌ ధామ్‌' నిలిచింది. ఈ సినిమాలో యామిగౌతమ్‌తో పాటు ప్రతీక్ గాంధీ నటించారు. వీరిద్దరి నటనకు తోడు రిషబ్ సేథ్ దర్శకత్వం కలిసి వచ్చింది. ఆకట్టుకున్న కథ, కాన్సెప్ట్‌ కారణంగా ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి వారం రోజుల లోపే ఈ సినిమాకు ఏకంగా 4.1 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. పుష్ప 2, లక్కీ భాస్కర్‌ సినిమాల తర్వాత ఈ మధ్య కాలంలో అత్యధిక వ్యూస్ లభించిన సినిమాగా ధూమ్‌ ధామ్‌ సినిమా నిలిచింది అంటూ ఓటీటీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

2023లో వచ్చిన యామి గౌతమ్‌ నటించిన చోర్ నికల్ కే భాగ సినిమా సైతం ఓటీటీ ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రిలీజ్ లేకుండా ఆ సినిమా డైరెక్ట్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయింది. నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక లెక్కల ప్రకారం ఆ సినిమా ఏకంగా 30 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికులు చూసిన సినిమాగా చోర్ నికల్ కే భాగ సినిమా నిలవడం విశేషం. ఇప్పుడు మరోసారి ధూమ్‌ ధామ్ సినిమాతో ఓటీటీలో తన సత్తా చాటుతోంది. రెగ్యులర్ సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చాలా మంది హీరోయిన్స్ ఓటీటీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించరు. కానీ యామి మాత్రం వరుసగా ఓటీటీ సినిమాల్లో నటిస్తూ అభిమానులను పెంచుకుంటూ వస్తుంది.

Tags:    

Similar News