భారీ సాహసానికి రెడీ అయిన యష్, గీతూ
టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను కె. వెంకట్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో అశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. కెజిఎఫ్2 తర్వాత నెక్ట్స్ సినిమా ఎవరితో చేయాలా అని ఎంతో ఆలోచించి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను కె. వెంకట్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇండియన్ భాషలతో పాటూ ఇంగ్లీష్ లో కూడా సమాంతరంగా షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్ లో షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా టాక్సిక్ రికార్డుల్లోకెక్కింది. టాక్సిక్ కు సంబంధించిన షూటింగ్ కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా జరుగుతుంది.
టాక్సిక్ అన్ని భాషల ఆడియన్స్ ఆస్వాదించేలా తెరకెక్కుతుందని, అందుకే కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాను రూపొందిస్తున్నామని, ఈ సినిమా అన్ని సరిహద్దుల్ని చెరిపేస్తుందని, అన్ని భాషల, సాంస్కృతిక ప్రపంచాన్ని కలిపేలా తమ సినిమా ఉంటుందని చెప్తున్న గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాతో చాలా పెద్ద రిస్కే చేస్తుంది.
అయితే టాక్సిక్ ను స్పెషల్ గా ఇంగ్లీష్ లో కూడా తీయడం వల్ల కలిగే ఉపయోగమేంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మూవీలో ఒరిజినల్ కంటెంట్ బావుంటే సినిమా ఏ భాషలో ఉన్నా ఆడియన్స్ తమ భాషలోని సబ్ టైటిల్స్ తో ఆ సినిమాను చూసేస్తారు. అలా కాకుండా ముందుగానే టాక్సిక్ కు ఇంగ్లీష్ వెర్షన్ తెరకెక్కించడం వెనుక డైరెక్టర్ గీతూ ఆంతర్యం ఏంటన్నది అర్థం కావడం లేదు.
దీని వల్ల బడ్జెట్ భారీగా పెరగడం, ఆర్టిస్టుల డేట్స్ ఎక్కువ అవసరమవడం ఖాయం. రాజమౌళి అంతటి డైరెక్టరే తన సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసి హాలీవుడ్ వెర్షన్ కు సబ్ టైటిల్స్ తో సరిపెట్టాడు. అలాంటిది యష్, గీతూ మాత్రం టాక్సిక్ విషయంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది అర్థమవడం లేదు.
ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ పెంచుకుందామనుకున్నారు అంటే దానికి హాలీవుడ్ వెర్షన్ పన్లేదు, జస్ట్ సినిమాను ఇంగ్లీష్ లో డబ్ చేసి మంచి రిలీజ్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే కెజిఎఫ్ తో వచ్చిన ఇమేజ్ ను నిలబెట్టుకోవాలని చూస్తున్న యష్ కు టాక్సిక్ సినిమా రిలీజ్ నాటికి ఒత్తిడిని పెంచడం ఖాయమనిపిస్తుంది. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర చేస్తుండగా, బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.