'యాత్ర-2' మూవీ రివ్యూ

Update: 2024-02-08 10:38 GMT

'యాత్ర-2' మూవీ రివ్యూ

నటీనటులు: జీవా-మమ్ముట్టి-మహేష్ మంజ్రేకర్-కేతకి నారాయణ్-సుజానె బెుర్నెట్-శుభలేఖ సుధాకర్-అశ్రిత వేముగంటి-సచిన్ ఖేద్కర్ తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

ఛాయాగ్రహణం: మది

నిర్మాత: శివ మేక

రచన-దర్శకత్వం: మహి.వి.రాఘవ్

ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' మంచి ఫలితాన్నందుకుంది. ఆ చిత్రాన్ని రూపొందించిన  మహి.వి.రాఘవ్.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 'యాత్ర-2'ను సిద్ధం చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యాత్ర-2' విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు వైఎస్ తనయుడైన జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటారు. కానీ హై కమాండ్ మాత్రం అతణ్ని కాదని రోశయ్యను ముఖ్యమంత్రిని చేస్తుంది. మరోవైపు జగన్ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారిని ఓదార్చేందుకు యాత్ర చేస్తుంటే హై కమాండ్ అడ్డుకుంటుంది. దీంతో పార్టీతో పాటు పదవులకూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తాడు జగన్. మరి ఈ ఎన్నికల్లో జగన్ ఎలా విజయం సాధించాడు.. అధికార పార్టీని వదిలిపెట్టాక అతడికి ఎదురైన సమస్యలేంటి.. వాటిని ఎదుర్కొని నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు.. ఈ విశేషాలు తెరపైనే చూడాలి.


కథనం-విశ్లేషణ:

యాత్ర.. పొలిటికల్ బయోపిక్స్ కు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా. రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు అనగానే ఒక నాయకుడికి ఎక్కడ లేని ఎలివేషన్లు ఇచ్చి.. అవతలి వాళ్ల మీద విపరీతంగా బురదజల్లే తరహాలోనే సినిమాలు తీస్తుంటారు. కానీ 'యాత్ర'లో మాత్రం ఆ డోస్ తగ్గించి.. వైఎస్ లోని మానవీయ కోణాన్ని ఎలివేట్ చేయడానికి మహి.వి.రాఘవ్ చేసిన ప్రయత్నం మెజారిటీ ప్రేక్షకులను మెప్పించింది. అందులో కూడా కొన్ని అతిశయోక్తులు.. కల్పనలు ఉన్నట్లు అనిపించినా.. అదొక వన్ సైడ్ వెర్షన్ లా కనిపించినా.. వైఎస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను హృద్యంగా తెరపై చూపించిన తీరు మాత్రం ఆకట్టుకుంది. వైఎస్ మీద ప్రత్యేక అభిమానం లేని వారిలోనూ కొంత కదలిక తెచ్చిన సినిమా అది. ఇప్పుడు మహి.. వైఎస్ తనయుడు జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా 'యాత్ర-2' తీశాడు. ఇందులోనూ వైఎస్ పాత్రను బాగా వాడుకుని కొన్ని హృద్యమైన సన్నివేశాలు తీశాడు. అలాగే జగన్ కు హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాకపోతే 'యాత్ర'తో పోలిస్తే ఇది మరీ వన్ సైడెడ్ అనిపిస్తుంది. దాంతో పోలిస్తే అతిశయోక్తులు.. కల్పనల డోస్ కొంచెం పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. జగన్ శత్రువులను బ్యాడ్ లైట్లో చూపించారు. కాకపోతే వారిని మరీ కించపరిచేలా చూపించకపోవడం అభినందించదగ్గ విషయం.

'యాత్ర-2' ఒక కన్వీనియెంట్ బయోపిక్కే. జగన్ అంటే నచ్చే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా గూస్ బంప్స్ ఇస్తుంది. వైఎస్ అభిమానులను మరోసారి తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆటోమేటిగ్గా ఈ సినిమా.. మిగతా వాళ్లకు రుచించదు. 'యాత్ర' వైఎస్ రాజకీయ జీవితంలో అత్యత కీలకంగా నిలిచిన పాదయాత్ర చుట్టూ నడిచే ఒక ఎమోషనల్ జర్నీ కాగా.. 'యాత్ర-2' వైఎస్ మరణానంతరం ఎదురైన సవాళ్లను ఛేదించి జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ను జగన్ కోణంలో చూపించే సినిమా. 'యాత్ర' స్థాయిలో కాకపోయినా ఇందులోనూ హ్యూమన్ యాంగిల్ అక్కడక్కడా హైలైట్ అయింది. అందుకోసం వైఎస్ పాత్రనే వాడుకున్నారు. ప్రధానంగా జగన్ కు హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వడానికే ఇందులో ప్రయత్నం జరిగింది. సంకల్ప బలం ఉంటే ఓ వ్యక్తి ఎలాంటి సవాళ్లనైనా ఛేదించి విజయం సాధించగలడని జగన్ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు మహి.వి.రాఘవ్. ఊహించినట్లే జగన్ ను ఇందులో పూర్తి పాజిటివ్ కోణంలో చూపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్రలను విలన్లుగా చిత్రీకరించారు. మరీ కించపరిచేలా.. వెకిలిగా ఆ పాత్రలను డిజైన్ చేయకపోవడం గమనార్హం.

వైఎస్ మరణంతో మొదలుపెడితే.. జగన్ విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే వరకు జరిగిన ముఖ్యమైన ఉదంతాలన్నీ అందరికీ తెలుసు. అవన్నీ మీడియాలో చూసిన విషయాలే. ఆ ప్రధాన ఘట్టాల నడుమ జరిగిన తెరవెనుక విషయాలు ఏంటి.. జగన్ ఏ సమయంలో ఎలా రియాక్టయ్యాడు.. తన మొండి పట్టుదలతో సవాళ్లకు ఎలా ఎదురు నిలిచాడు.. ఈ విషయాలన్నింటినీ తెర మీద మహి.వి.రాఘవ్ ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశాడు. జగన్ ఎంతటి మొండివాడో కొన్ని సన్నివేశాలతో బలంగా చూపించాడు మహి. జగన్ కు ఇప్పటికీ బలంగా నిలుస్తున్నది వైఎస్ కొడుకు అన్న ముద్రే కాబట్టి.. ఆ పాత్రను యాత్ర-2లోనూ చాలా బాగా వాడుకున్నాడు మహి. ఆరోగ్యశ్రీ పెట్టడానికి దారి తీసిన కారణం చూపిస్తూ ఒక హృద్యమైన ఎపిసోడ్ తో సినిమాకు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత కూడా సమయానుకూలంగా వైఎస్ పాత్రను చక్కగా వాడుకున్నాడు. వైఎస్ మరణానికి సంబంధించిన ఎపిసోడ్ ఆయన అభిమానులను కదిలిస్తుంది.

ఆ తర్వాత ఫోకస్ జగన్ పాత్ర మీదికి మళ్లుతుంది. జగన్ని ముఖ్యమంత్రిని చేయడానికి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం.. అది పార్టీ హై కమాండుకి రుచించకపోవడం.. రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడం.. జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుడితే.. దానికి పార్టీ అడ్డు చెప్పడం.. ఆయన ఆ పార్టీని వదిలి సొంతంగా పార్టీ పెట్టి ఉప ఎన్నికలకు వెళ్లి గెలవడం.. ఆపై కేసులు.. జైలు.. బెయిలు.. 2014 ఎన్నికలు.. అందులో ఓటమి తర్వాత పాదయాత్ర.. 2019 ఎన్నికల్లో ఘనవిజయం వరకు తెలిసిన విషయాలనే పకడ్బందీగా తెరపైన చూపించాడు మహి. తనకు సవాళ్లు ఎదురైనపుడు జగన్ ఎలా మొండిగా నిలబడ్డాడో చూపించే సన్నివేశాాలు ఆ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చాయి. అవి జగన్ అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. ముఖ్యంగా కడపోడి నైజం.. జగన్ మొండితనం గురించి చెప్పే సన్నివేశాల్లో ఎలివేషన్ బాగా పండింది. ఐతే అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఏమీ ఉండదు. ఒక దశ దాటాక కథ మరీ ఏకపక్షం అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. జగన్ పాత్రను ఎలివేట్ చేయడానికి ఆయన శత్రువులను బ్యాడ్ లైట్లో చూపించే ప్రయత్నం కొంచెం శ్రుతి మించిన ఫీలింగ్ కలుగుతుంది. మహి ద్వితీయార్ధంలో ఈ విషయాల్లో కొంచెం నియంత్రణ కోల్పోయాడనిపిస్తుంది. ఐతే ముగింపు సన్నివేశాల్లో వైఎస్ మరణం తర్వాత కూడా సాధించిన విజయం గురించి.. జగన్ సంకల్పం గురించి చెప్పిన మాటలు బాగున్నాయి. జగన్ విషయంలో ఎవరి ఆలోచన ఎలా అయినా ఉండొచ్చు. ఐతే మనిషి సంకల్పం అన్నింటికంటే గొప్పది అని ఆ పాత్ర ద్వారా చెప్పడం బాగుంది. పొలిటికల్ బయోపిక్స్ అన్నాక వన్ సైడెడ్ అనిపించడం సహజం. 'యాత్ర-2' కూడా అందుకు భిన్నమేమీ కాదు. కానీ జగన్ కథను నీట్ గా.. బలంగా చెప్పడంలో మహి విజయవంతం అయ్యాడు.


నటీనటులు:

జీవా జగన్ పాత్రను గొప్పగా పోషించాడు. లుక్స్ పరంగానే కాక హావభావాల విషయంలోనూ అతను జగన్ లా కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో తెరపై కనిపిస్తుంది. ఎక్కడా అతి చేయకుండా నీట్ గా ఆ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు జీవా. జగన్ వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలో ప్రతిబింబించేలా చేయడంలో జీవా కృషి అభినందనీయం. వైఎస్ పాత్రలో మమ్ముట్టి మరోసారి గొప్పగా నటించారు. కనిపించిన తక్కువ సన్నివేశాల్లోనే బలమైన ముద్ర వేశారు. సోనియా పాత్రకు సుసానె సరిపోయింది. చంద్రబాబు పాత్రకు మహేష్ మంజ్రేకర్ అంతగా సూట్ కాలేదనిపిస్తుంది. ఆయన నటన ఓకే. శుభలేఖ సుధాకర్ జగన్ పాత్రకు ఎలివేషన్ ఇచ్చే క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. సచిన్ ఖేద్కర్ బాగా చేశాడు. జగన్ తల్లి.. భార్య పాత్రల్లో అశ్రిత.. కేతకి కూడా మెప్పించారు.


సాంకేతిక వర్గం:

పొలిటికల్ బయోపిక్ అయినప్పటికీ.. రెగ్యులర్ ఫీచర్ ఫిలిమ్స్ తరహాలో 'యాత్ర-2'లో ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో రూపొందింది. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతంలో ముఖ్య ఘట్టాలను బాగా ఎలివేట్ చేశాడు. అలాగే ఎమోషనల్ సీన్లలోనూ ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. మది ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. రైటర్ కమ్ డైరెక్టర్ మహి.వి.రాఘవ్.. తాను చెప్పాలనుకున్న కథను నీట్ గా తెరపై ప్రెజెంట్ చేశాడు. పొలిటికల్ బయోపిక్స్ తీయడంలో మరోసారి తన నైపుణ్యాన్ని చూపించాడు. జగన్ కథను బలంగా చెప్పడానికి అతను ఎంచుకున్న సన్నివేశాలు.. రాసుకున్న డైలాగులు బాగున్నాయి. ''దేవుడు నమ్మకం.. వైఎస్సార్ నిజం'' లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి.


చివరగా: యాత్ర-2.. నాణేనికి ఒక వైపే.. కానీ పద్ధతిగా.. బలంగా!

రేటింగ్ - 2.75/5





Tags:    

Similar News