ఇన్ కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చిందో తెలుసా?
అవును... భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
ఇన్ కమ్ ట్యాక్స్ గురించి పెద్దగా ఎవరికీ పరిచయం అక్కరలేదనే అనుకోవాలి. లెక్కకు మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. అయితే అసలు ఈ ఇన్ కం టాక్స్ ఎప్పుడు ప్రారంభమైంది.. ఎవరు మొదలుపెట్టారు.. ఎందుకు మొదలుపెట్టారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..!
దేశంలో ఆదాయపు పన్ను సదుపాయాన్ని ప్రవేశపెట్టిన జ్ఞాపకార్థం ఆదాయపు పన్ను శాఖ ప్రతి సంవత్సరం జూలై 24ని ఆదాయపు పన్ను దినోత్సవం లేదా "ఆయ్కార్ దివస్"గా పాటిస్తుంది. 1860 సంవత్సరంలో ఇదే రోజున, భారతదేశంలో మొదటి సారిగా సర్ జేమ్స్ విల్సన్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు.
అవును... భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇది ఇది ఆదాయపు పన్ను దినోత్సవ 163వ వార్షికోత్సవం. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను దినోత్సవం నాడు.. ఆదాయపు పన్ను, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (సీబీడీటీ) వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఆదాయపు పన్ను దినోత్సవం భారత ప్రభుత్వానికి, పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన రోజు. దీంతో ఈ రోజున స్మారక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేస్తుంది. భారతదేశంలో 150 సంవత్సరాల ఆదాయపు పన్నును పురస్కరించుకుని జూలై 24, 2010న మొదటిసారిగా "ఆయ్కార్ దివస్" కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
ఈ ఆదాయ పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాక్స్ చెల్లింపులను ప్రోత్సహించడం, భవిష్యత్తులో ట్యాక్స్ సక్రమంగా చెల్లించేలా చేయడం మీద అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా... పౌరులందరూ సకాలంలో ట్యాక్స్ కట్టినట్లయితే దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంటుంది.
తాజాగా సోమవారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లోని ప్లీనరీ హాల్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి సమక్షంలో 164వ ఆదాయపు పన్ను దినోత్సవం జరిగింది. ఈ వేడుకలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.
ఇదే సమయంలో ఆదివారం నాడు ఐటీ డిపార్ట్ మెంట్ సైక్లోథాన్ లో 300 మందికి పైగా డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. భారత రైఫిల్ షూటర్, ప్రపంచ కప్ పతక విజేత అయోనికా పాల్ తో పాటు నటులు సునీల్ శెట్టి, విక్కీ కౌశల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాగా... 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2023.