మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తారా? షాకింగ్ అధ్యయనం గురించి చదవండి

జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండనిదే క్షణం గడవదు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ అతిగా వాడేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కఠిన నిజం ఒకటి తాజాగా అధ్యయనం రూపంలో బయటకు వచ్చింది.

Update: 2023-08-06 06:06 GMT

జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండనిదే క్షణం గడవదు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ అతిగా వాడేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కఠిన నిజం ఒకటి తాజాగా అధ్యయనం రూపంలో బయటకు వచ్చింది. గడిచిన కొంతకాలంగా చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్న వైనం ఒక అలవాటుగా మారింది. అన్నం తినిపించటానికో.. మొండికేస్తే దారికి తెచ్చుకోవటానికో.. ఇలా ఏదో ఒక కారణానికి స్మార్ట్ ఫోన్లను చేతికి ఇచ్చేస్తున్నారు. అయితే.. అదే మాత్రం మంచిది కాదని.. దాని వినియోగం పిల్లల్లో పెరిగే కొద్దీ ఎలాంటి నష్టాలు వస్తాయన్న విషయాన్ని వాషింగ్టన్ కు చెందిన సరియన్ ల్యాబ్స్ చేసిన అధ్యయనం వెల్లడించింది.

గ్లోబల్ మైండ్ ప్రాజెక్టులో భాగంగా ఈ అధ్యయనాన్ని 41 దేశాలకు చెందిన 18-24 ఏళ్ల మధ్యనున్న 27,969 మందిపైన అధ్యయనం చేశారు. దీని ద్వారా తేలిందేమంటే.. చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ వినియోగించటం మొదలు పెట్టిన వారు.. పెద్దయ్యాక వారి మానసిక స్థితి బలహీనంగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ పరిస్థితి యువకులతో పోలిస్తే.. యువతుల్లో ఎక్కువగా ఉందని తేల్చారు. ఉత్తర అమెరికా.. యూరోప్.. లాటిన్ అమెరికా.. ఓషియానియా.. దక్షిణాసియా.. ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక పరిస్థితులను 47 అంశాల ఆధారంగా అధ్యయనం చేపట్టారు.

అబ్బాయిలు ఆరేళ్ల వయసు నుంచే ఫోన్ వాడటం మొదలు పెట్టిన వారిలో 42 శాతం మంది మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటే.. 18 ఏళ్ల వయసులో ఫోన్ వాడటం మొదలు పెట్టిన వారు 36 శాతం మానసిక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించారు. ఇదిలా ఉంటే అమ్మాయిల్లో ఆరేళ్ల నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం మంది సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే.. పద్దెనిమిదేళ్ల వయసులో వాడటం మొదలు పెట్టిన వారిలో ఈ సమస్య 46 శాతం ఉన్న విషయాన్ని గుర్తించారు.

వయసు పెరిగిన తర్వాత స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెట్టిన వారిలో దుష్ప్రభావం కొంత తక్కువగా ఉన్న విషయాన్ని తేల్చారు. మొబైల్ వాడకం వల్ల మానసిక సమస్యల చెడుతో పాటు.. మరికొన్ని మంచి కూడా ఉన్నాయని చెబుతున్నారు. అబ్బాయిల్లోఆత్మవిశ్వాసం.. ఇతరులతో సానుకూల సంబంధాల్ని నెరపటంతో పాటు.. సామాజిక దృక్పథం మారినట్లుగా తేల్చారు. అయితే.. అమ్మాయిల్లో అయితే.. మానసిక స్థితి మెరుగుపడినట్లుగా గుర్తించారు. ఇక.. స్మార్ట్ ఫోన్ల వినియోగించే అమ్మాయిల్లో ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండే ధోరణి తగ్గటంతోపాటు.. ఆత్మహత్య ఆలోచనలు.. దుందుడుకు భావాల విషయంలో గతంలో పోలిస్తే మార్పులు వచ్చినట్లుగా వెల్లడైంది.

Tags:    

Similar News