పిల్లలను ప్లాన్ చేస్తున్నారా... 3 నెలల ముందు గ్రామాలకు వెళ్తే బెటర్!
ఈ రోజుల్లో పిల్లలను కనడం ఒకెత్తు అయితే.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పిల్లలకు జన్మనివ్వడం మరొకెత్తు అని అంటున్నారు.
ఈ రోజుల్లో పిల్లలను కనడం ఒకెత్తు అయితే.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పిల్లలకు జన్మనివ్వడం మరొకెత్తు అని అంటున్నారు. తల్లితండ్రులకు ఉన్న అనారోగ్య సమస్యలు, ఒత్తిడితో పాటు వాయుకాలుష్యంతో నిండిన వాతావరణలో ఉరుకుల పరుగుల జీవితం.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చుపిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవును... సంపూర్ణ ఆరోగ్యంతో పిల్లలకు జన్మనివ్వడం ఈ రోజుల్లో చాలా క్లిష్టంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పిల్లలకు చిన్న వయసులోనే దృష్టి లోపం, ఊబకాయం, బీఎంఐ స్థాయిలు ఎక్కువగా ఉండటం వంటివి చిన్న వయసులోనే మొదలవ్వడానికి కారణం.. గర్భధారణకు ముందు మూడు నెలల పాటు మహిళలు పీల్చే గాలి చాలా కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.
ఆ సమయంలో వాయుకాలుష్యానికి లోనైతే అది పుట్టబోయే బిడ్డపై పెను ప్రభావం చూపిస్తుందని.. ఫలితంగా.. శిశువు పుట్టిన రెండు ఏళ్లలోపే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) స్థాయిలు ఎక్కువగా ఉండటంతో పాటు ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు అమెరికాలోని కేకె స్కూల్ ఆఫ్ మెడిసిన్, చైనాలోని ఫుదాన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.
వాస్తవానికి గర్భం ధరించడానికి మూడు నెలల ముందు నుంచే వీర్యకణాలు, అండాలు పరిపక్వ దశకు చేరుకుంటాయి.. ఈ సమయంలో తల్లి వాతావరణ కాలుష్యానికి లోనవ్వకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. సుమారు 5,834 మంది తల్లులను.. వారికి పుట్టిన బిడ్డలను అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పరిశోధన "ఎన్విరాన్ మెంటల్ జర్నల్"లో ప్రచురితమైంది.
ఈ సందర్భంగా స్పందించిన అమెరికాలోని కేక్ స్కూల్ పరిశోధకుడు, డాక్టర్ జియోవెన్ లియావో... గర్భధారణకు మూడు నెలల ముందు నుంచి అతి సూక్ష్మ ధూళి కణాలు, సూక్ష్మ ధూళి కణాలతో పాటు వాహనాల నుంచి విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలకు గురైన వారి పిల్లల్లో బీఎంఐ పెరిగిందని తెలిపారు. గర్భధారణకు మూడు నెలల ముందు కాలుష్య రహిత వతావరణంలో మహిళ ఉండటం ముఖ్యమని తెలిపారు.
ఈ కాలుష్య కారకాలకు తల్లి గర్భంలోనే గురైన బిడ్డలకు ఊబకాయం వస్తుందని.. ఇలా బిడ్డలకు ఊబకాయం రాకుండా ఉండాలంటే మహిళలు గర్భధారణకు మూడు నెలల ముందు నుంచె కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దీంతో... కాలుష్య రహిత వాతావారణ అంటే... ఆ సమయంలో మహిళలు గ్రామాలకు వెళ్లి, పచ్చని పైరు గాలుల మధ్య ఉంటే మేలనే కామెంట్లు వినిపిస్తున్నాయి.