టాటూతో క్యాన్సర్.. షాకిచ్చిన అధ్యయన రిపోర్టు

పాత రోజుల్లో పచ్చబొట్టు.. ఇప్పుడు టాటూ. గతంలో ఒక రంగుకే పరిమితమయ్యే పచ్చబొట్లకు అత్యాధునిక సాంకేతికతతో రంగురంగుల టాటూలు వేయించుకోవటం ఇప్పుడు ప్యాషన్ గా మారింది.;

Update: 2025-03-11 07:30 GMT

పాత రోజుల్లో పచ్చబొట్టు.. ఇప్పుడు టాటూ. గతంలో ఒక రంగుకే పరిమితమయ్యే పచ్చబొట్లకు అత్యాధునిక సాంకేతికతతో రంగురంగుల టాటూలు వేయించుకోవటం ఇప్పుడు ప్యాషన్ గా మారింది. ఇటీవల కాలంలో టాటూలు వేయించుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఐదారుగురు పైనే చిన్నదో.. చితకదో టాటూ వేసుకోవటం కామన్ అయ్యింది.

అయితే.. టాటూతో క్యాన్సర్ ముప్పు ఉందన్న షాకింగ్ నిజాన్ని కేస్ స్టడీస్ తో చెప్పుకొచ్చిందో అధ్యయనం. డెన్మార్క్ రీసెర్చర్లు కవలల మీద నిర్వహించిన తాజా అధ్యయనం ఈ ముప్పును ప్రత్యేకంగా ప్రస్తావించింది. టాటూతో క్యాన్సర్ ముప్పు 33 శాతం నుంచి 62 శాతం వరకు ఉంటుందని గుర్తించారు. ఎంత పెద్ద టాటూ అయితే అంత ఎక్కువ క్యాన్సర్ ముప్పు ఉంటుందని గుర్తించారు.

అరచేతి కంటే పెద్ద సైజు ఉన్న పచ్చబొట్టుతో చర్మ క్యాన్సర్ ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు తేల్చారు. టాటూలు వేసుకునే వారికి లింఫోమా ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. చర్మంలోకి చొచ్చుకెళ్లే పచ్చబొట్టు సిరా రేణువులు లోపలకు వెళ్లి.. లింఫ్ గ్రంథుల్లో పోగు పడొచ్చన్న అంచనాకు వచ్చారు. ఈ అధ్యయనం చేసేందుకు జన్య.. పర్యావరణ పరంగా ఒకేలాంటి అంశాల్ని పంచుకునే కవలల్ని ఎంపిక చేసుకొని పరిశీలించారు.

టాటూ పొడిపించుకోని కవలతో పోలిస్తే పొడిపించుకున్నకవలకు చర్మ.. లింఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎంత పెద్దగా.. ఎంత ముందుగా వేయించుకుంటే అంత ఎక్కువగా లింఫ్ గ్రంథుల్లో సిరా పోగుపడుతున్నట్లుగా తేలింది. వీటిని వేయించుకున్న వారి శరీరంలోకి వెళ్లే సిరాను.. తమకు సంబంధం లేనివిగా భావించి.. రోగనిరోధక వ్యవస్థ టాటూ సిరా మీద నిరంతరం దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ సిరా లింఫ్ గ్రంథుల పనితీరును బలహీనం చేస్తుందో.. లేదో.. ఇతర జబ్బులకు దారి తీస్తుందా? లేదా? అన్నది తెలియలేదు. ఈ నేపథ్యంలో సిరా రేణువులు లింఫ్ గ్రంథుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవటానికి రీసెర్చర్లు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా సరదాకు వేసుకునే టాటూతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం తాజా అధ్యయనం స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News