కొలువుల మాట చెప్పిన నాస్కామ్

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని.. దీంతో ఆ రంగంలో మొత్తం ఉద్యోగులు 58 లక్షలకు చేరినట్లుగా పేర్కొంది.

Update: 2025-02-25 05:10 GMT

ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది నాస్కామ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొలువుల మార్కెట్ ఏ మాత్రం బాగోలేదని.. నియామకాలకు సంబంధించి ప్రతికూల వాతావరణం ఉందన్న మాటలో అర్తం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటం ద్వారా.. యువతకు కొత్త ఆశల పల్లకిలో ప్రయాణించేలా చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల ఉద్యోగాలను ఇచ్చిన ఐటీ రంగం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అదే స్థాయిలో ఉపాధిని కల్పిస్తుందన్న అంచనాను వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని.. దీంతో ఆ రంగంలో మొత్తం ఉద్యోగులు 58 లక్షలకు చేరినట్లుగా పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ రంగం ఉపాధి అవకాశాల్ని కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. పలు కంపెనీలు ఏఐను అందిపుచ్చుకోవటం.. అజెంటిక్ ఏఐకి గిరాకీతో పాటు జీసీసీల సంఖ్య పెరుగుతుండటం ఐటీ పరిశ్రమ ధోరణినే మార్చేస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ..హెల్త్ కేర్.. రిటైయిల్ లోకి డిజిటల్ ఇంజనీరింగ్ ను విస్తరించటం కలిసి వస్తున్న అంశంగా పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు కొంత ఆందోళనకు గురి చేస్తున్నా.. సెంటిమెంట్ మాత్రం సానుకూలంగా ఉందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగ ఆదాయాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ ఆదాయాలు 282.6 బిలియన్లకు చేరనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్ల మేర చేరొచ్చని చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.26 లక్షల కోట్లకు చేరుకోవచ్చన్న అంచనాను నాస్కామ్ వేస్తోంది. దీంతో.. కొత్త కొలువులకు ఢోకా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News