పోలింగ్ రోజు ట్రిప్ ప్లాన్ చేసినోళ్లంతా దీన్ని చదవాలి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి.

Update: 2023-10-29 14:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 30న కీలకమైన పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్ లో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా 102 ఏళ్ల అవ్వ ఒకరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఆమె పేరు బుధియారి కౌడన్. ఆమె ఓటు వేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన ఓటుహక్కును వినియోగించుకోవటం కోసం 102 ఏళ్ల అవ్వ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారిని చూసిన తర్వాతైనా.. తాజా ఎన్నికల పోలింగ్ వేళ.. ఓటు కంటే లాంగ్ ట్రిప్ లకు ప్లాన్ చేసే వారు సిగ్గు పడేలా అవ్వ వ్యవహరించారని చెబుతున్నారు. కాంకేర్ జిల్లాకు చెందిన ఈ అవ్వ తన ఓటుహక్కును ఇంటి నుంచి వినియోగించుకోవటానికి ఆసక్తిని ప్రదర్శించిన వైనం మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు.

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఎన్నికల వేళ.. పెద్ద వయస్కులు తమ ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి.. ఓటు వేసేందుకు వెళ్లి.. క్యూలో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా తమ ప్రాంతానికి చెందిన బూత్ లెవల్ అధికారికి సమాచారం అందిస్తే.. ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తారు.

ఓటరు ఇంటికే వచ్చే అధికారులు ఫారం 12డీని అందిస్తారు. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ను బీఎల్ వోకు అందిస్తారు. దాన్ని ఆర్వోకు పంపుతారు. దరఖాస్తు ఆధారంగా పెద్దవయస్కులు.. దివ్యాంగులకు ఇంటి వద్దకే పోస్టల్ బ్యాలెట్ పంపుతారు. ఇలా ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనంలో వెళతారు. అందులో ఇద్దరు పోలింగ్ అధికారులు.. ఒక వీడియో గ్రాఫర్ తో పాటు.. మరో పోలీసు కూడా వారి వెంట ఉంటారు.

ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన తర్వాత.. అధికారులునిర్దేశించిన పోలింగ్ కంపార్ట్ మెంటులో ఓటరు రహస్యంగా ఓటు వేసి.. బ్యాలెట్ బాక్సులో వేస్తారు. ఈ వ్యవహారాన్ని వీడియో తీయాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఒక రోజు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో కాంకేర్.. అంతాగఢ్.. భానుప్రతాప్ ఫుర్ నియోజకవర్గాల్లో దాదాపు 306 మంది ఓటర్లు 80ఏళ్లకు పైబడిన వారే. వీరంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయటం కష్టం కావటంతో.. ఎన్నికల అధికారులే ఇంటికి వచ్చి ఓటు వేయించుకున్నారు.

Tags:    

Similar News