బాబు పై అలిపిరి బాంబు దాడికి ఇరవయ్యేళ్ళు
హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న అనాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబును అలిపిరి వద్ద బాంబులతో మావోయిస్టులు అటాక్ చేసారు.
సరిగ్గా ఇప్పటికి ఇరవయ్యేళ్ళ క్రితం అంటే అక్టోబర్ 1న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న అనాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబును అలిపిరి వద్ద బాంబులతో మావోయిస్టులు అటాక్ చేసారు.
ఈ దాడిలో బాబు బతికి బయటపడ్డారు. మావోయిస్టులు క్లేమోర్ మైన్స్ తో బాబు మీద దాడి చేశారు. అయితే ఆయనది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో స్వల్ప గాయాలతో చంద్రబాబు బయట పడగలిగారు. ఆనాడు బాబు మీద బాంబు దాడి జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశం అయింది.
అప్పటి ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉరుకులు పరుగులు మీద తిరుపతి చేరుకుని చంద్రబాబుని పరామర్శించారు. బాబుకు ఏమైందో అని తల్లడిల్లారు. ఆ మరుసటి రోజైన అక్టోబర్ 2న అహింస స్పూర్తితో ఒక రోజు నిరసన కూడా చేసి ఇలాంటి బాంబు దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సందేశం కూడా వినిపించారు వైఎస్సార్.
ఇక చంద్రబాబు అలిపిరి బాంబు దాడి తరువాతనే ఉమ్మడి ఏపీలో సార్వత్రిక ఎన్నికలను ఆరు నెలల ముందుకు జరిపించి 2024 మేలో జరిగేట్టు చూసారు. తనకు సానుభూతి వస్తుందని ఆయన భావించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. అంతే కాదు ఉమ్మడి ఏపీకి ఆయన ఎన్నడూ సీఎం కాలేకపోయారు. తిరిగి 2014లోనే ఆయన విభజన ఏపీకి సీఎం అయ్యారు.
ఇక బాబు మీద దాడి చేసిన వారి విషయంలో సమగ్రమైన విచారణ జరిగింది. కేసు పదకొండేళ్ళ పాటు సాగింది. అనంతరం నలుగురు దోషులకు నాలుగేళ్ల పాటు శిక్ష పడింది. ఇక ఇదే కేసులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే మీద కూడా కేసు పెట్టారు. అయితే సకాలంలో చార్షిషీటు దాఖలు చేయకపోవడంతో కేసు లేకుండా పోయింది.
మొత్తానికి అలిపిరిలో మావోల బాంబు దాడి నుంచి బాబు బయటపడగలిగారు కానీ ఆయన ఆ తరువాత దాదాపుగా పదేళ్లకు పైగా రాజకీయంగా చేదు అనుభవాలను చవి చూసారు. రెండు సార్లు ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. చివరికి 2014 నాటికి తెలంగాణాలో టీడీపీ రాజకీయాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.