విశాఖ బీజేపీలో చక్రం తిప్పుతున్నదెవరు ?
2012 నుంచి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యునిగా అలా కొనసాగుతూ వస్తున్నారు.
ఆయన పేరులోనే సీఎం ఉంది. పైగా రాజకీయాల్లో కీలకంగా ఉంటారు. అందుకే ఆయనకు అంత పలుకుబడి పరపతి కూడా ఉన్నాయి. ఆయనే సీఎం రమేష్. రెండు సార్లు రాజ్యసభలో ఎంపీగా పనిచేసిన సీఎం రమేష్ ఆ పదవీకాలం అలా ముగిసీ ముగియగానే అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్ సభలో ఎంపీ అయిపోయారు. 2012 నుంచి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యునిగా అలా కొనసాగుతూ వస్తున్నారు.
సీఎం రమేష్ టీడీపీలోనే 1985 నుంచి పనిచేస్తూ వస్తున్నారు. ఆ పార్టీలో ఆయన కీలక నేతగా ఎదిగారు. టీడీపీ అధినాయకత్వానికి ఆయన అత్యంత సన్నిహితంగా కూడా మెలిగారు. ఆయన 2019 ఎన్నికల తరువాత బీజేపీలోకి షిఫ్ట్ అవుతారు అని ఎవరూ అనుకోలేదు. అయితే ఆయన అలా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నా తన సంబంధాలను అందరితోనూ కొనసాగిస్తూ మిత్రుడిగానే ఉన్నారు
ఇపుడు చూస్తే బీజేపీ ఉన్న ఎన్డీయే కూటమిలోనే టీడీపీ సైతం ఉంది కాబట్టి అందరూ మిత్రులే అయిపోయారు. సీఎం రమేష్ ఎక్కడో రాయలసీమ నుంచి విశాఖ జిల్లాకు వచ్చినా అనకాపల్లి పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగినది అయినా అక్కడ ప్రజల మెప్పును ఆయన పొందగలిగారు. ఆ విధంగా ఆయన తన రాజకీయ చతురతతో గెలిచి చూపించారు.
ఇపుడు ఆయన విశాఖలో బీజేపీకి అతి ముఖ్య నాయకుడిగా మారిపోయారు. ఆయన తనదైన వ్యూహాలతో మెల్లగా వైసీపీలోని నేతలను ఒక్కొక్కరినీ బయటకు తీసుకుని వస్తున్నారు. కార్పోరేటర్ స్థాయి నుంచి కీలక నేతల దాకా అందరినీ ఆయన బీజేపీ వైపుగా నడిపిస్తున్నారు.
అలా ఆయన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కుటుంబాన్ని కూడా బీజేపీ వైపు తీసుకుని వచ్చారు. అని అంటున్నారు. ఆడారి కుటుంబానికి విశాఖ జిల్లాలో కింగ్ మేకర్ అన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. జిల్లాలో అరడజన్ నియోజకవర్గాలలో వారికి పలుకుబడి ఉంది.
ఆడారి తులసీరావు టీడీపీకి తెర వెనక నుంచి మద్దతు ఇస్తూ వచ్చారు. ఆయన కుమారుడు ఆనంద్ మాత్రం రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. అయినా సరే సామాజిక సమీకరణలు చూసుకున్నా అంగబలం అర్ధం బలం లెక్క వేసుకున్నా ఆడారి కుటుంబం బీజేపీలో చేరడం ఆ పార్టీకి అనుకూలించే అంశమని అంటున్నారు.
దీని వల్ల ఇప్పటికే విశాఖ నగరంలో కొంత వరకూ బలంగా ఉన్న బీజేపీ ఇపుడు రూరల్ జిల్లాలో కూడా గట్టిగా బలపడుతుందనీంటున్నారు. ఇక వైసీపీలో ఉన్న కీలక నేతలను వరసబెట్టి తీసుకుని రావడంలో సీఎం రమేష్ ది కీలకమైన పాత్ర అని అంటున్నారు. అందుకే ఆయనకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే జమిలి ఎన్నికల మీద కేంద్రం వేసిన జేపీసీలో ఆయనకు మెంబర్ షిప్ దక్కింది. సీఎం రమేష్ వంటి బిగ్ షాట్ బీజేపీకి విశాఖలో ఉండడంతో ఆ పార్టీ ఇదే అదనుగా చేసుకుని రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తోంది. రానున్న రోజులలో సీఎం రమేష్ ఆపరేషన్ ఆకర్ష్ కి చిక్కే వైసీపీ నేతలు ఎవరు అన్నది చూడాలని అంటున్నారు.