ఆప్ వర్సెస్ కాంగ్రెస్.. కూటమి కోటకు బీటలు!

సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం.

Update: 2024-12-26 09:30 GMT

కేంద్రంలో ఇండియా కూటమికి బీటలు వారుతున్నది. ఒక్కో పార్టీ నుంచి మెల్లమెల్లగా కూటమి నుంచి తప్పుకుంటున్నాయి. అంతేకాకుండా.. కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ వైఖరిపై పార్టీలు నిరసనగళం వినిపిస్తున్నాయి. సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం.

కేంద్రంలో బీజేపీ అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా 24 విపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. కూటమికి రోజురోజుకూ బీటలు వారుతున్నది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల వేళ ఈ విభేదాలు వెలుగు చూడగా.. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా నిరసన వ్యక్తం అయింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి పెట్టలేని నాయకుడిని ఎన్ని రోజులని భరిస్తాం అంటూ ఒక్కో పార్టీ నేతల నుంచి వాయిస్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంలోనే ఆప్ తన స్పష్టమైన వైఖరిని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, కూటమి తరఫున పోటీ చేయబోమని తెలిపారు. ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో కూటమి, ఆప్ మధ్య దూరం మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇండియా కూటమి నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీని తొలగించేందుకు కూటమిలోని ఇతర పార్టీలను సంప్రదిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలపడం ఆందోళన కలిగించే పరిణామం.

ఆప్‌ను లక్ష్యంగా చేసుకొని అజయ్ మాకెన్‌తోపాటు ఇతర ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆప్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజనలతోపాటు సంజీవని యోజనను ప్రభుత్వం నోటిఫై చేయలేదని ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడాన్ని సైతం ఆప్ సీరియస్‌గా తీసుకుంది. అలాగే.. ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ తప్పుడు, మోసపూరిత హామీలను ఇస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపైనా ఆప్ సీరియస్ అయింది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News