రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు బంపర్ ఆఫర్

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లే భావించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2025-01-28 09:43 GMT

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి కూటమి ప్రభుత్వం భారీ గిఫ్ట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఆయన సస్పెన్షన్లో ఉన్న కాలాన్ని విధులు నిర్వహించినట్లే భావించాలని సూచిస్తూ పోలీసు శాఖను ఆదేశించింది. అంతేకాకుండా ఆ సమయంలో ఆయనకు ఇవ్వాల్సిన వేతనం, అలవెన్సులు అన్నీ పూర్తిగా చెల్లించాలని సూచించింది. ఆయనపై నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకోవడమే కాకుండా సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరించడంతో ఏబీకి ముఖ్యమంత్రి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లేనంటున్నారు.

2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో నిఘా అధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కపెట్టింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏబీవీని పక్కకు తప్పించడమే కాకుండా, నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తూ పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించి తిరిగి పోస్టింగ్ తెచ్చుకుంటే, విధుల్లోకి తీసుకున్న మరునాడే మళ్లీ సస్పెండ్ చేశారు. ఇలా జగన్ సీఎంగా ఉండగా ఒక్కరోజు కూడా ఆయన విధుల్లో లేకుండా అడ్డుకున్నారని చెబుతారు. ఇక కోర్టును ఆశ్రయించిన ఏబీవీ రిటైర్మెంటుకు ఒక్కరోజు ముందు పోస్టింగ్ తెచ్చుకున్నారు.

ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీవీకి తగిన న్యాయం జరుగుతుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలు ప్రకారమే తాజాగా ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీవీని తొలుత 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లడంతో 2022 ఫిబ్రవరి 7న సస్పెన్షన్ ఎత్తివేశారు. ఆ తర్వాత రెండోసారి 2022 జూన్ 28న మరోసారి సస్పెండ్ చేశారు. ఈ సారి 2024 మే 30 వరకు సస్పెన్షన్ కొనసాగించారు.

ఇక ఆయన అదే ఏడాది మే 31న రిటైర్ అయ్యారు. దీంతో దాదాపు నాలుగేళ్లపాటు ఆయన వేతనం తీసుకోలేకపోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లే భావించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సస్పెన్షన్ కాలానికి రావాల్సిన అన్ని వేతనాలు, అలవెన్సులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం చెల్లించనుంది. అంతేకాకుండా ఏబీవీపై గత ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాలను కూటమి ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకుంది.

Tags:    

Similar News