బాబు కోసం సోము.... టీడీపీలో చర్చ ..!
అయితే.. సోము గతంలో టీడీపీ విషయంలో వ్యవహరించిన తీరు, మూడు రాజధానుల విషయంలో మౌనంగా ఉన్న సమయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.;
బీజేపీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సోము వీర్రాజు వ్యవహారం.. టీడీపీలో ఆసక్తిగా మారింది. బీజేపీ తరఫున ఒకే ఒక్క స్థానం కేటాయించిన నేపథ్యంలో ఈ సీటును సోము వీర్రాజు దక్కించుకున్నారు. దీనికి కేంద్రంలోని పెద్దల ఆశీస్సులు ఉండడంతో సోము పంట పండింది. అయితే.. ఈవ్యవహారంలో ఎక్కువగా స్పందించాల్సింది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే. ఎందుకంటే.. బీజేపీకి సంఖ్యా పరంగా ఓటు బ్యాంకు తక్కువ.
అంటే.. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువ. దీంతో ఈ నెల 20న జరగనున్న ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా సోమును సమర్థించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడా తేడాలేదు. అయితే.. దీనిపై తర్జన భర్జన కొనసాగుతోంది. కానీ, చంద్రబాబు ఆదేశం, కూటమి నిర్ణయాన్నికాదనే పరిస్థితి నాయకుల్లోనూ కనిపించడం లేదు. దీంతో నాయకులు ఖచ్చితంగా ఓటేసేందు కు రెడీగానే ఉన్నారు.
అయితే.. సోము గతంలో టీడీపీ విషయంలో వ్యవహరించిన తీరు, మూడు రాజధానుల విషయంలో మౌనంగా ఉన్న సమయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. విశాఖ ఉక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరి స్తున్నారన్న ఆరోపణలు వచ్చిన సమయంలోనూ ఆయన వ్యవహరించిన తీరును ఇప్పుడు ఎమ్మెల్యేలు గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీలో లోపాయికారీ చెలిమి చేసిన విధానంపైనా నాయకులు గుసగుసలాడు తున్నారు. ఇక, కూటమి పొత్తు విషయం ఎప్పుడు తెరమీదికి వచ్చినా.. టీడీపీతో కలిసేది లేదని కూడా సోము బహిరంగ ప్రకటనలు చేశారు.
అలాంటి సోముకు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. (అయితే.. పోటీ లేనందున.. ఏకగ్రీవాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పోలింగ్ కూడా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది) దీంతో తమ్ముళ్ల ఓట్లు సోముకు వేయాలని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు కోసం.. సోముకు ఓటు వేయాలని ఎమ్మెల్యే తమ్ముళ్లు రెడీ అయ్యారు. కానీ, ఇప్పుడు ఏకగ్రీవాలు అవుతున్నాయన్న సమాచారం అందుతోంది.