తిరుమల అన్న ప్రసాదానికి విరాళాలు రూ.2200 కోట్లు పైమాటే
ఈ పథకం ప్రారంభం రోజున 2 వేల మందికి మాత్రమే అన్న ప్రసాదం అందించగా, ప్రస్తుతం రోజుకు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతోంది.;
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళాలు రూ.2,200 కోట్లు దాటాయని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు అన్నదానం అందించడంలో విశేషమైన పాత్ర పోషిస్తున్న ఈ ట్రస్ట్ అనేక మంది దాతల సహకారంతో అభివృద్ధి చెందింది.
*అన్నదాన పథకం ప్రారంభం
1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. 2014లో దీనిని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌గా టీటీడీ పేరు మార్చింది. ఈ పథకం ప్రారంభం రోజున 2 వేల మందికి మాత్రమే అన్న ప్రసాదం అందించగా, ప్రస్తుతం రోజుకు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతోంది.
* దాతల విరాళాలు.. ట్రస్ట్ అభివృద్ధి
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు దాదాపు 9.7 లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళం అందించిన దాతల సంఖ్య 139. తిరుమలలో ఒక్క రోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు సుమారు రూ.44 లక్షలు. ఇప్పటి వరకు 249 మంది దాతలు ఒక్కొక్కరు రూ.44 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అన్న ప్రసాదంపై తితిదే ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్న ప్రసాదం అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా భోజనం మెనూలో వడలను కూడా చేర్చారు. తితిదే అందిస్తున్న అన్నప్రసాదంపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భక్తుల విశ్వాసం, దాతల ఔదార్యంతో తిరుమలలోని అన్న ప్రసాద సేవ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.