పెద్దగా ఫోకస్ కాని ఈ 3 వార్తలు మనపై ప్రభావాన్ని చూపుతాయి

కొన్ని కీలక పరిణామాలు మీడియాలో పెద్దగా ఫోకస్ కాకుండా ఉంటాయి. వాటిని కేవలం సమాచారం రూపంలో చూస్తే అవన్నీ మామూలుగానే కనిపిస్తాయి.;

Update: 2025-03-12 08:11 GMT

కొన్ని కీలక పరిణామాలు మీడియాలో పెద్దగా ఫోకస్ కాకుండా ఉంటాయి. వాటిని కేవలం సమాచారం రూపంలో చూస్తే అవన్నీ మామూలుగానే కనిపిస్తాయి. కానీ.. ఈ సమాచార లోతుల్లోకి వెళితే.. రోజువారీ జీవితాల్లో మార్పులకు కారణమవుతాయన్న విషయం అర్థమవుతుంది. అలాంటి ఐదు వార్తలకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. సాదాసీదాగా అనిపించే వార్తలు.. అవి మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయన్న సమాచారాన్ని చూస్తే..

1. స్టార్ లింక్ తో జియో డీల్

మన దేశంలో టెలికం సేవల్ని చూస్తే.. ఈ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీకి ముందు.. ఆ తర్వాత అని చెప్పాలి. సెల్ ఫోన్ అన్నది ఖరీదైన వ్యవహారంగా ఉన్న వేళలో.. కేవలం రూ.600 కడితే ఫోను.. సిమ్ ఇచ్చేసిన రోజు మొదలుకొని.. ఆ మధ్యన జియోతో ముకేశ్ అంబానీ మొదలుపెట్టిన డిజిటల్ మేజిక్ వరకు అందరికి అన్ని విషయాలు గుర్తుండే ఉంటాయి. అప్పటివరకు పొదుపుగా డేటాను వినియోగించే తీరుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా డేటాను వాడేయటం.. అది కూడా ఒక రేంజ్ వేగంతో వాడటంలో జియో ఎంత కీ రోల్ ప్లే చేసిందో తెలిసిందే.

ఇప్పుడు జియో మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో జట్టు కట్టింది. ఈ డీల్ తో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని భారత్ లో జియో అందించే వీలు కలుగుతుంది. తాజాగా ఈ రెండు దిగ్గజ సంస్థలు చేసుకున్న ఒప్పంద వివరాలు బయటకు వచ్చాయి. దేశంలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సేవల దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి.

2. ఆమె ఆస్తులు సీజ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ లో ఆమె రాజకీయ ప్రత్యర్థుల కారణంగా అధికారాన్ని వదిలేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్న ఆమెకు ఆ దేశ కోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ లో ఉన్న హసీనా ఆస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తుల్ని సీజ్ చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దశాబ్దాల నుంచి బంగ్లాదేశ్ లో అమలు చేస్తున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగి పెద్దవి కావటం.. గత ఏడాది ఆగస్టులో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందటం తెలిసిందే. ఈ పరిణామాలు భారత్ మీద బంగ్లాదేశీయుల్లో కోపాన్ని పెంచటంతో పాటు.. అపార్థం చేసుకుంటున్న వైనం ఎక్కువ అవుతోంది.

3. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు మనోడు చెప్పిన తాజా మాట విన్నారా?

నోరి దత్తాత్రేయుడు.. తెలుగు వైద్య రత్నంగా చెప్పాలి. క్యాన్సర్ రోగులకు వరంగా ఆయన వైద్య సేవల్ని చెబుతారు. అలాంటి ఆయన తాజాగా ప్రభుత్వాలకు కీలక సూచన చేశారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నేపథ్యంలో.. ఆయన చేసిన సూచనను తెలుగు రాష్ట్రాలు తక్షణమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో వ్యక్తిగతంగా ఎవరికి వారు ఏమేం చేయాలో కూడా ఆయన చెబుతున్నారు.

ప్రభుత్వాలకు ఆయన చేస్తున్న సూచన ఏమంటే.. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్త్రత స్థాయిలో ఉచితంగా చేయాలని చెబుతున్నారు. మరి..దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది వేరే విషయం. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఏమేం చేయాలో చెబుతున్న ఆయన.. 45 ఏళ్లు దాటిన మహిళలు.. 50 ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా ముందస్తు క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని.. ఇలా చేస్తే ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను నియంత్రించే వీలు ఉంటుందని చెబుతున్నారు.

క్యాన్సర్ కేసుల్లో 10 శాతం మాత్రమే వారసత్వంగా వస్తుంటే.. మిగిలినవి జీవన విధానం.. ఆహారపు అలవాట్లు.. పొగాకు.. ఇతర దురలవాట్ల కారణంగానే వస్తున్న విషయాన్ని పేర్కొన్నారు. క్యాన్సర్ కేసుల నియంత్రణకు ప్రభుత్వాలు మాత్రమే కాదు.. కార్పొరేట్.. స్వచ్ఛంద సంస్థలు కూడా చేయి కలపాలని.. అప్పుడు మాత్రమే క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారా? పాలకులు.. ప్రజలు మిస్ కాకుండా వినాల్సిన మాటలుగా వీటిని చెప్పాలి.

Tags:    

Similar News